IPL 2023, MI vs PBKS:లక్నోలో  పరుగులు తీయడానికి బ్యాటర్లు నానా తంటాలు పడితే వాంఖెడేలో మాత్రం పరుగుల వరద  ఏరులై పారింది.  దంచుడు సమరంలో అటు  పంజాబ్ ఇటు ముంబై ఏమాత్రం  తక్కువ తిన్లేదు. బాదుడు సమరంలో ఇరు జట్లు  బౌలర్లపై పోటెత్తినా చివరికి విజయం మాత్రం పంజాబ్ నే వరించింది. 

శనివారం వీకెండ్ ఎంజాయ్ చేద్దామని టీవీల ముందు కూర్చున్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అసలైన మజాను అందించింది. శనివారం మధ్యాహ్నం లక్నో - గుజరాత్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ ముగిసిన వెంటనే మొదలైన ముంబై - పంజాబ్ మ్యాచ్ కు ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. లక్నోలో పరుగులు తీయడానికి బ్యాటర్లు నానా తంటాలు పడితే వాంఖెడేలో మాత్రం పరుగుల వరద ఏరులై పారింది. దంచుడు సమరంలో అటు పంజాబ్ ఇటు ముంబై ఏమాత్రం తక్కువ తిన్లేదు. ఇరు జట్ల బాదుడుకు బలైంది బౌలర్లే. 

వాంఖెడే వేదికగా ముంబై - పంజాబ్ మధ్య ముగిసిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్దే ఆగిపోయింది. చాలా రోజుల తర్వాత ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తన మార్కు ఆటతో వాంఖేడేలో మోత మోగించాడు. బాదుడు సమరంలో ఇరు జట్లు బౌలర్లపై పోటెత్తినా చివరికి విజయం మాత్రం పంజాబ్ నే వరించింది. 

భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కు రెండో ఓవర్లోనే షాకిచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. అతడు వేసిన రెండో ఓవర్లో ఫస్ట్ బాల్ కే ఇషాన్ ను ఔట్ చేశాడు. అయితే ఇషాన్ ఔటైనా ముంబై ఇన్నింగ్స్ ను కెప్టెన్ రోహిత్ శర్మ (27 బంతుల్లో 44, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ తో కలిసి చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 50 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో కొడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే లివింగ్‌స్టొన్ వేసిన పదో ఓవర్లో రెండో బాల్ ఫోర్ కొట్టిన రోహిత్.. మూడో బాల్ కు అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

అప్పుడొచ్చాడు సూర్య.. 

రోహిత్ నిష్క్రమించేటప్పటికీ ముంబై స్కోరు పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్లో ఓ ఫోర్ కొట్టాడు. తుఫానుకు ముందు వీచిన చిన్న ఈదురుగాలి అది. సూర్య బాదుడకు ఫస్ట్ బలైన బౌలర్ లివింగ్‌స్టొన్. అతడు వేసిన 12వ ఓవర్లో సూర్య హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లో భారీ సిక్సర్. సామ్ కరన్ వేసిన 14వ ఓవర్లో 4, 6 బాదాడు. రాహుల్ చాహరే వేసిన 15వ ఓవర్లో ఓ ఫోర్ కొట్టాడు. ఇదే క్రమంలో గ్రీన్ కూడా 6, 4 కొట్టి ఈ సీజన్ లో రెండో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఎల్లీస్ వేసిన 16వ ఓవర్లో గ్రీన్.. 6, 4 కొట్టి ముంబై స్కోరును 150 దాటించాడు. కానీ మూడో బాల్ కు గ్రీన్ ఔట్. అయినా ముంబై అభిమానులు ఆశలు కోల్పోలేదు. సామ్ కరన్ వేసిన 17వ ఓవర్లో 4 కొట్టి 23 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు సూర్య. ఇదే ఓవర్లో తన ట్రేడ్ మార్క్ షాట్ తో భారీ సిక్సర్. ఇక అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టి సూర్యకు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ ఓవర్లో నాలుగో బాల్ కు సూర్య భారీ షాట్ ఆడబోయి అథర్వకు క్యాచ్ ఇచ్చాడు. పంజాబ్ ఆటగాళ్ల ముఖాలలో ఏదో తెలియని ఆనందం. మ్యాచ్ గెలిచినంత సంబురం కనిపించాయి . 

Scroll to load tweet…

వికెట్లు విరగ్గొట్టిన అర్ష్‌దీప్

చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన క్రమంలో నాథన్ ఎల్లీస్ వేసిన 19వ ఓవర్లో 15 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా కరన్.. అర్ష్‌దీప్ సింగ్ కు బాల్ ఇచ్చాడు. ఫస్ట్ బాల్ లో ఫుల్ టాస్. ఒక పరుగు మాత్రమే వచ్చింది. రెండో బాల్ కు పరుగులేమీ రాలేదు. మూడో బాల్ కు తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్. ఈ బంతికి మద్యలో వికెట్ విరిగిపోయింది. నాలుగో బాల్ కు నెహల్ వధేరా.. సేమ్ సీన్ రిపీట్. ఈ బాల్ కూ వికెట్ రెండు ముక్కలైంది. తర్వాత జోఫ్రా ఆర్చర్ రెండు బంతుల్లో ఒక్క పరుగే చేశాడు. ఈఓవర్లో అర్ష్‌దీప్ 2 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి ముంబైని ఓడించాడు. 

ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పంజాబ్ సారథి సామ్ కరన్ (29 బంతుల్లో 55, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కు తోడుగా హర్‌ప్రీత్ సింగ్ భాటియా (28 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ జితేశ్ శర్మ (7 బంతుల్లో 25, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది.