Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 Qualifier 2: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ కోసం...

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న  ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఆట..

IPL 2023 MI vs GT Qualifier 2: Mumbai Indians won the toss and elected to field first against Gujarat Titans CRA
Author
First Published May 26, 2023, 7:51 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. వర్షం కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. 

లీగ్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది గుజరాత్ టైటాన్స్. ఇరు జట్ల మధ్య ఇంతకుముందు 3 మ్యాచులు జరగగా రెండు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, ఓ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిచాయి. 

గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచింది ముంబై ఇండియన్స్. 2023 సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే అహ్మదాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గెలిచింది..

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్‌లపైనే ప్రధానంగా ఆధారపడింది. సూర్య ఈ సీజన్‌లో 544 పరుగులు చేస్తే, ఇషాన్ కిషన్ 454 పరుగులు చేశాడు. కామెరూన్ గ్రీన్ 422 పరుగులతో ఉన్నాడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో 15 మ్యాచుల్లో 722 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మరో 9 పరుగులు చేస్తే ఫాఫ్ డుప్లిసిస్ (730 పరుగులు) ని అధిగమించి ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశం దక్కించుకుంటాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఇప్పటికే ఐపీఎల్ 2023 సీజన్ నుంచి తప్పుకున్నారు. ఐదో స్థానంలో ఉన్న డివాన్ కాన్వే, ఆరో స్థానంలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడం చాలా కష్టమైన పని..

625 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీకి పైగా పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 574 పరుగులే చేశాడు. అతను ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే 165 పరుగులు చేయాలి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ కలిసి ఈ సీజన్‌లో ఇప్పటికే 51 వికెట్లు తీశారు..

గత మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి అదరగొట్టిన ఆకాశ్ మద్వాల్‌తో పాటు పియూష్ చావ్లా, ముంబై ఇండియన్స్‌కి కీ బౌలర్‌గా మారాడు. అత్యంత పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటాన్స్‌ని, ధృడమైన బ్యాటింగ్ లైనప్, అనుభవం లేని బౌలింగ్ యూనిట్ ఉన్న ముంబై ఇండియన్స్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా పెద్దగా ఫామ్‌లో లేరు. 

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ

 ముంబై ఇండియన్స్ జట్టు ఇది: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూస్ చావ్లా, జాసన్ బెహ్రాడార్ఫ్, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మద్వాల్

Follow Us:
Download App:
  • android
  • ios