IPL 2023: ఐపీఎల్-16లో నేడు లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య మరో ఆసక్తికర సమరం జరుగనున్నది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడటం లేదు. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచింది.
ఐపీఎల్-2023 సీజన్ ను వరుసగా రెండు విజయాలతో ప్రారంభించిన పంజాబ్ కింగ్స్.. తర్వాత ఢీలా పడింది. కోల్కతా, రాజస్తాన్ పై నెగ్గిన శిఖర్ ధావన్ సారథ్యంలోని గబ్బర్ గ్యాంగ్.. హైదరాబాద్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇటీవలే మొహాలీలో గుజరాత్ చేతిలో కూడా ఓడింది. కానీ ఈ ఓటములకు బ్రేక్ వేసేందుకు గాను నేడు ఆ జట్టు.. లక్నో వేదికగా కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ కు రానుంది.
నేటి మ్యాచ్ లో సామ్ కరన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్.. ధావన్ లేకుండానే బరిలోకి దిగుతున్నది. గుజరాత్ తో మ్యాచ్ లో ధావన్ గాయపడ్డాడు. అందుకే అతడి స్థానంలో కరన్ సారథిగా వచ్చాడు. ఈ విషయాన్ని టాస్ సందర్భంగా అతడే వెల్లడించాడు.
కేకేఆర్, రాజస్తాన్ లో విజయం తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిన పంజాబ్ ను బ్యాటింగ్ వైఫల్యాలు వేధిస్తున్నాయి. ఆ రెండు మ్యాచ్ లలో దూకుడుగా ఆడిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్.. తర్వాత మ్యాచ్ లలో విఫలమయ్యాడు. ధావన్ పామ్ లోనే ఉన్నా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడటం లేకపోవడం పంజాబ్ కు ఎదురుదెబ్బే.
గుజరాత్ తో మ్యాచ్ లో మాథ్యూ షార్ట్, సామ్ కరన్, షారుఖ్ ఖాన్ ఫర్వాలేదనిపించారు. మరి నేటి మ్యాచ్ లో వీళ్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్ లో అర్ష్‌దీప్, రబాడా రాణిస్తున్నా స్పిన్నర్ రాహుల్ చాహర్ విఫలమవుతున్నాడు.
మరో వైపు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింటిలో గెలిచిన జోష్ లో ఉంది. చెన్నైతో ఓడిన మ్యాచ్ మినహా ఆ జట్టు ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు ఇటీవలే ముగిసిన ఆర్సీబీతో పోరులో ఆకట్టుకుంది. లక్నో బ్యాటర్లు పూరన్, స్టోయినిస్ తో పాటు కైల్ మేయర్స్, బదోనిలు ఫామ్ లో ఉన్నారు.
తుది జట్లు :
లక్నో : కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, అయుష్ బదోని, అవేశ్ ఖాన్, యుద్విర్ సింగ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
పంజాబ్ : అథర్వ, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికిందర్ రజా, సామ్ కరన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రర్, కగిసొ రబాడా, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
