IPL 2023, LSG vs MI: ఐపీఎల్ - 16 లీగ్ స్టేజ్ దాదాపు చివరి దశకు చేరుకున్నా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరుగనుంది.
ఐపీఎల్-16 లో మొత్తం లీగ్ మ్యాచ్ లు 70 ఉండగా ఇందులో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 63వ లీగ్ మ్యాచ్ జరుగుతున్నా ప్లేఆఫ్స్ కు వెళ్లే నాలుగు జట్ల మీద స్పష్టత రాలేదు. ఈ క్రమంలో నేడు లక్నో - ముంబై లు లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియం వేదికగా కీలక పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నట్టే అవుతుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ కు రానుంది.
ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 9 విజయాలతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరగా రెండో స్థానంలో ఉన్న చెన్నై (15 పాయింట్లు) కూడా ఆ దిశగా చేరేందుకు సిద్ధమైంది. అయితే 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ముంబై.. నేడు లక్నోతో గెలిస్తే.. 16 పాయింట్లతో చెన్నైని వెనక్కి నెట్టడమే గాక ప్లేఆఫ్స్ కు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టే అవుతుంది.
మరోవైపు 12 మ్యాచ్ లలో ఆరు గెలిచి ఐదింట ఓడిన లక్నో.. 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఆ జట్టుకు తిప్పలు తప్పవు. ఐదు, ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆర్సీబీ, రాజస్తాన్, పంజాబ్ లు 12 పాయింట్లతో ఉన్నాయి. ఇందులో రాజస్తాన్ మినహా మిగిలిన రెండు జట్లూ రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. బెంగళూరు, పంజాబ్ లు తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఆ జట్లతో నాలుగో స్థానానికి లక్నో తీవ్రమైన పోటీని ఎదుర్కుంటుంది.
ముంబై ఓడిపోతే కూడా దాదాపు ఇదే పరిస్థితి తలెత్తుతుంది. దీంతో మరే సంచలనాలు తావివ్వకుండా ఈ మ్యాచ్ లోనే గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాయి.
స్లో పిచ్..
లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్వంత జట్టు (లక్నో సూపర్ జెయింట్స్) కు తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్ లలో లక్నో రెండింట్లో మాత్రమే గెలిచింది. స్లో టర్నర్ అయిన లక్నో లో రెండోసారి ఛేదన చేసే జట్టుకు కష్టాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ 160 కొట్టినా విజయం మీద ధీమాతో ఉండొచ్చు. మరి ఇలాంటి పిచ్ పై రోహిత్ ఛేదనకు దిగడం సాహసమే. చూద్దాం రోహిత్ సేన లక్నోలో ఏం మ్యాజిక్ చేసేనో..!
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహల్ వధెర, టిమ్ డేవిడ్, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా, క్రిస్ జోర్డాన్, ఆకాశ్ మధ్వల్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, అయుష్ బదోని, రవి బిష్ణోయ్, స్వప్నీల్ సింగ్, నవీన్ ఉల్ హక్, మోహ్సిన్ ఖాన్
