IPL 2023, LSG vs MI Eliminator: ఐపీఎల్ -16 లో ప్లేఆఫ్స్ షెడ్యూల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. 

ఐపీఎల్ -16 లో భాగంగా ప్లేఆఫ్సలో నేడు లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే అహ్మదాబాద్ లో క్వాలిఫయర్ - 2 లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్ - 1 మాదిరిగా మరో అవకాశం లేదు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో తొలుత బౌలింగ్ చేయనుంది. 

ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి ఎనిమిదింటిలో గెలిచిన లక్నో.. 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ లో మూడో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్.. 14 మ్యాచ్ లలో 8 గెలిచి 16 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ రెండు జట్లు నేడు హోరాహోరికి దిగనున్నాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ పై రోహిత్ సేనకు చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ లో గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన లక్నో.. ఇప్పటివరకూ 3 సార్లు ముంబైతో తలపడగా మూడుసార్లూ రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో కూడా లక్నో - ముంబై మ్యాచ్ లో కృనాల్ సేనదే విజయం. మరి నేటి కీలక మ్యాచ్ లో లక్నో గండాన్ని ముంబై ఏ మేరకు అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక బలాబలాల విషయంలో ఇరు జట్లూ సమఉజ్జీలే. బ్యాటింగ్ విభాగంలో ముంబైకి ఇషాన్, రోహిత్, సూర్య, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నెహల్ వధేర, తిలక్ వర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. లక్నోలో కూడా క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అయుష్ బధోని తో పాటు కెప్టెన్ కృనాల్ కూడా బ్యాటింగ్ చేయగలడు.

అయితే బౌలింగ్ విషయంలో మాత్రం ముంబై కంటే లక్నో వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ ఒక్కడే పేసర్ల విభాగంలో రాణిస్తున్నాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ పియూష్ చావ్లా ఉండటం ముంబైకి కలిసొచ్చేదే. కాగా లక్నోకు మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ తో పాటు కృనాల్ పాండ్యా, యశ్ ఠాకూర్ రూపంలో మంచి బౌలింగ్ యూనిట్ ఉంది.

Scroll to load tweet…

తుది జట్లు : 

లక్నో సూపర్ జెయింట్స్ : అయూష్ బదోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహల్ వధేర, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, హృతీక్ షోకీన్, జేసన్ బెహ్రన్‌డార్ఫ్