Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: కైల్ మేయర్స్ ‘సూపర్’ హాఫ్ సెంచరీ, లక్నో భారీ స్కోరు.. ఆఖరి ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ల ఎంట్రీ!

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో అదిరిపోయే హాఫ్ సెంచరీ బాదిన కైల్ మేయర్స్.. నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ మెరుపులు.. 

IPL 2023: kyle mayers scores half century, Delhi Capitals used impact player in last over cra
Author
First Published Apr 1, 2023, 9:23 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.. మొదటి ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ 1 పరుగు మాత్రమే ఇవ్వగా, రెండో ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు ముకేశ్ కుమార్. చేతన్ సకారియా వేసిన నాలుగో ఓవర్‌లో సిక్సర్ కొట్టి వేగం పెంచేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్, అదే ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 12 బంతుల్లో 8 పరుగులు చేసిన రాహుల్, అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో రాహుల్ అవుట్ కావడం ఇది మూడోసారి...

19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. 6 ఓవర్లు ముగిసే సరికి 30 పరుగులే చేసిన లక్నో, ఆ తర్వాత కైల్ మేయర్స్  ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. మేయర్స్ బాదుడుకి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 11 ఓవర్లు ముగిసే సమయానికి 98 పరుగులకు చేరుకుంది.

కైల్ మేయర్స్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ హుడా 18 బంతుల్లో 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు చేసిన కైల్ మేయర్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు కైల్ మేయర్స్. బ్రెండన్ మెక్‌కల్లమ్ 158, మైకేల్ హుస్సీ 116, షాన్ మార్ష్ 84 పరుగులు చేసిన కైల్ మేయర్స్ కంటే ముందున్నారు. 

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్, మొదటి మ్యాచ్‌లో పర్వాలేదనిపించే పర్పామెన్స్ ఇచ్చాడు..

21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన నికోలస్ పూరన్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో పృథ్వీ షాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఖలీల్ అహ్మద్ ప్లేస్‌లో ఆమన్ ఖాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి తీసుకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్... ఆఖరి ఓవర్‌ వేసిన చేతన్ సకారియా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన ఆయుష్ బదానీ, లక్నో స్కోరుని 180 దాటించాడు..  

7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ, ఇన్నింగ్స్ ముగియడానికి ఒక్క బంతి ముందు అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా 13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కృష్ణప్ప గౌతమ్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి తీసుకొచ్చింది లక్నో. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన కృష్ణప్ప గౌతమ్, లక్నో స్కోరుని 193కి చేర్చాడు. 

చివరిసారిగా 2015లో ఐపీఎల్ ఆడిన రిలే రసో, 2901 రోజుల తర్వాత మళ్లీ 2023 సీజన్‌లో చోటు దక్కించుకున్నాడు. 2011 తర్వాత 2022లో రీఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (3962 రోజులు) తర్వాతి స్థానంలో నిలిచాడు రిలే రసో. 

Follow Us:
Download App:
  • android
  • ios