IPL 2023, KKR vs PBKS: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్  కింగ్స్ బ్యాటర్లు విఫలమయ్యారు.   కెప్టెన్ మినహా మిగిలినవారంతా  తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. 

ఐపీఎల్-16లో ప్లేఆఫ్స్ కు దగ్గరవుతున్న క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ శిఖర్ దావన్ (47 బంతుల్లో 57, 9 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగిలినవారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కేకేఆర్ బౌలర్లు కట్టడి చేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది. చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు పిండుకోవడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. మరి 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన కేకేఆర్.. సొంత గ్రౌండ్ లో ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా..? అన్నది ఆ జట్టు బ్యాటర్ల ఆటతీరుపై ఆధారపడి ఉంది. 

టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (12) వికెట్ ను రెండో ఓవర్లోనే కోల్పోయింది. ధావన్ తో కలిసి ఫస్ట్ వికెట్ కు 21 పరుగులు జోడించిన ప్రభ్‌సిమ్రన్‌ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. 

వన్ డౌన్ లో వచ్చిన భానుక రాజపక్స డకౌట్ అయ్యాడు. భానుకను కూడా హర్షిత్ నే పెవిలియన్ చేర్చాడు. హర్షిత్ వేసిన నాలుగో ఓవర్లో నాలుగో బంతికి భానుక.. వికెట్ కీపర్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. భానుక నిష్క్రమణ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ కూడా విఫలమయ్యాడు. 9 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 15 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో మూడో బంతికి ఎల్బీగా నిష్క్రమించాడు. 

వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో ధావన్ నెమ్మదిగా ఆడాడు. లివింగ్‌స్టోన్ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ తో పంజాబ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 53 పరుగులు జోడించారు. 18 బంతులలో 21 పరుగులు చేసిన జితేశ్‌ను కూడా వరుణ్ బోల్తా కొట్టించాడు. అతడు వేసిన 13వ ఓవర్లో మూడో బాల్ కు జితేశ్.. గుర్బాజ్ చేతికి చిక్కాడు. సునీల్ నరైన్ వేసిన 14వ ఓవర్లో మూడో బాల్ కు సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్‌ను కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా ఔట్ చేశాడు. 15 ఓవర్లకు పంజాబ్ చేసిన స్కోరు 124-5 గా నమోదైంది. 

చివరి ఐదు ఓవర్లలో.. 

వరుసగా వికెట్లు కోల్పోవడంతో లోయరార్డర్ బ్యాటర్లు కూడా హిట్టింగ్ చేయలేకపోయారు. రిషి ధావన్ 11 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 19 పరుగులు చేయగా సామ్ కరన్ (4) విఫలమయ్యాడు. 16 వ ఓవర్లో ఏడు పరుగులే రాగా వరుణ్ వేసిన 17వ ఓవర్లో 8 పరుగులొచ్చాయి. 18వ ఓవర్లో సుయాశ్ కూడా నాలుగు పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. కానీ వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్లో హర్‌ప్రీత్ బ్రర్ (9 బంతుల్లో 17 నాటౌట్, 2 ఫోర్లు, 1సిక్స్) రెండు, షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ బౌండరీ బాది 15 పరుగులు రాబట్టారు. ఇక హర్షిత్ వేసిన చివరి ఓవర్లో షారుక్.. 6, 4, 4, తో పాటు బ్రర్ ఓ సిక్స్ ఆడటంతో పంజాబ్ స్కోరును 175 మార్కు దాటించాడు.