IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌పై బోణీ కొట్టిన రోహిత్ సేన! టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్న కోల్‌కత్తా... 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..

మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్, గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ఆఖరి ఓవర్ చివరి బంతికి విజయం అందుకుంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకుంది కోల్‌కత్తా నైట్ రైడర్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడినా 200కి పైగా పరుగులు చేసి పోరాడింది..

నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్ ఇలా కోల్‌కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తితో పాటు సునీల్ నరైన్ కూడా చక్కగా రాణిస్తున్నాడు. అయితే ఫాస్ట్ బౌలర్ల నుంచి ఆశించిన రేంజ్ పర్ఫామెన్స్ రాలేదు..

గత మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి తొడ కండరాలు పట్టేయడంతో మూడో ఓవర్‌ని పూర్తి కూడా చేయలేకపోయాడు ఆండ్రే రస్సెల్. అయితే వేసిన 13 బంతుల్లో 3 వికెట్లు తీసిన రస్సెల్, బ్యాటింగ్‌లో ఇప్పటిదాకా తన రేంజ్ మెరుపులు చూపించలేకపోయాడు.. అలాగే లూకీ ఫర్గూసన్ కూడా ఈ సీజన్‌లో భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు..

లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో హారీ బ్రూక్ బౌండరీల మోత మోగించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి బోణీ కొట్టింది. అయితే ముంబై టీమ్‌లో సరైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసినా వికెట్ తీయలేకపోయిన జోఫ్రా ఆర్చర్, గాయం తిరగబెట్టడంతో ఆ తర్వాత రెండు మ్యాచులు ఆడలేదు. 

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తున్నాడు. 2021 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, గత రెండు సీజన్లలోనూ అతన్ని ఆడించలేదు. ఎట్టకేలకు అర్జున్‌కి అవకాశం దక్కింది. నేటి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇది: రహ్మనుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, నారాయణ్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, లూకీ ఫర్గూసన్

ముంబై ఇండియన్స్ జట్టు ఇది: ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, అర్జున్ టెండూల్కర్, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెడరిత్