IPL 2023, KKR vs LSG: ఐపీఎల్- 16 లీగ్ దశ పోటీలు ముగుస్తున్న వేళ మరో ఆసక్తికర ముగింపు. కోల్కతా - లక్నో మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ మెరుపులు మెరిపించినా లక్నో విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
ఐపీఎల్ - 16 లో ప్లేఆఫ్స్ రేసు దాదాపు ముగిసింది. మూడు జట్లు బెర్త్ ను ఖాయం చేసుకున్నాయి. ఇదివరకే గుజరాత్ అందరికంటే ముందే ప్లేఆఫ్స్ చేరగా శనివారం ఢిల్లీ వేదికగా ముగిసిన ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన చెన్నై టాప్ - 2 పొజిషన్ తో ప్లేఆఫ్స్‌కు చేరగా.. కోల్కతా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ నెగ్గి మూడో స్థానాన్ని ఖాయం చేసుకుంది. లక్నో నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఫలితంగా లక్నో.. ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.
కోల్కతా తరఫున రింకూ సింగ్ (33 బంతుల్లో 67 నాటౌట్ , 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి బంతి వరకూ పోరాడినా విజయం మాత్రం ఒక్క పరుగు తేడాతో లక్నోను వరించింది. ఈ ఓటమితో కోల్కతా ప్లేఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక ముంబై - హైదరాబాద్, బెంగళూరు - గుజరాత్‌ల మధ్య మ్యాచ్ లో గెలిచిన జట్టు నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఓపెనర్లు శుభారంభమే అందించారు. వెంకటేశ్ అయ్యర్.. 15 బంతుల్లోనే 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 24 పరుగులు చేశాడు. జేసన్ రాయ్ కూడా ధాటిగా ఆడాడు. కృనాల్ వేసిన ఐదో ఓవర్లో అతడు మూడు బౌండరీలు బాదాడు. కేకేఆర్‌కు కృష్ణప్ప గౌతమ్ ఫస్ట్ షాకిచ్చాడు. అతడు వేసిన ఆరో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ .. రవి బిష్ణోయ్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అతడి స్థానంలో వచ్చిన నితీశ్ రాణా (8) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న జేసన్ రాయ్.. కృనాల్ వేసిన పదో ఓవర్లో ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్.. 82-3గా ఉంది.
ఆ తర్వాత స్పిన్నర్లు కట్టడి చేయడంతో కేకేఆర్ స్కోరు వేగం తగ్గింది. తర్వాత నాలుగు ఓవర్లలో ఆ జట్టు 26 పరుగులే చేయగలిగింది. యశ్ ఠాకూర్ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి గుర్బాజ్ (10) కూడా వెనుదిరిగాడు. 15 ఓవర్లు ముగిసేటప్పటికీ కోల్కతా స్కోరు.. 114-4 కి చేరింది.
రింకూ మ్యాజిక్..
చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ విజయానికి 63 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్లో మూడో బాల్ కు సిక్సర్ బాదిన రసెల్ (7) మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 17వ ఓవర్ వేసిన నవీన్ ఉల్ హక్ ఐదు పరుగులే ఇచ్చాడు. యశ్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్లో పది పరుగులు వచ్చినా కేకేఆర్ శార్దూల్ ఠాకూర్ (3), సునీల్ నరైన్ (1) వికెట్లను కోల్పోయింది.
నవీన్ ఉల్ హక్ వేసిన 19వ ఓవర్లో రింకూ సింగ్ విశ్వరూపం చూపించాడు. ఈ ఓవర్లో రింకూ.. 4, 4, 4 ,6 తో 20 పరుగులు రాబట్టాడు. ఇదే క్రమంలో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా రింకూ.. ఇదే సీజన్ లో గుజరాత్ తో అహ్మదాబాద్ లో మాదిరిగా ఐదు సిక్సర్ల మ్యాజిక్ చేయపోతాడా..? అని కేకేఆర్ అభిమానులు ఆశపడ్డారు.యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో వైభవ్ సింగిల్ తీసి రింకూకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆతర్వాత రెండు బంతులకు రెండు వైడ్స్ రూపంలో రెండు పరుగులొచ్చాయి. నాలుగో బాల్ కు రింకూ సిక్సర్ కొట్టాడు. ఐదో బాల్ కు డీప్ ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా ఫోర్. దీంతో సమీకరణం వన్ బాల్ 8 రన్స్ గా మారింది. చివరి బంతికి రింకూ సిక్సర్ బాదినా కేకేఆర్ స్కోరు 175 పరుగుల వద్దే ఆగిపోయి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున నికోలస్ పూరన్ (58) అర్థ సెంచరీతో రాణించగా క్వింటన్ డికాక్ (28), ప్రేరక్ మన్కడ్ (26), అయుష్ బదోని (25) లు ఫర్వాలేదనిపించారు.
