SRH vs RR Live IPL 2023: ఐపీఎల్ - 16లో టైటిల్ విజేతలుగా ఫేవరెట్ల జాబితాలో ఉన్న రాజస్తాన్ రాయల్స్.. తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించింది. సన్ రైజర్స్ బౌలర్లను ఉతికారేసింది.
కుదిరితే బౌండరీ.. లేకుంటే సిక్సర్.. బంతిని బాదడమే లక్ష్యం. బౌలర్ చేతి నుంచి బాల్ రిలీజ్ అవ్వడమే లేటు.. బాల్ బౌండరీ లైన్ ను దాటడమే తరువాయి. బ్యాటింగ్ లో విధ్వంసం అన్న వ్యాఖ్యానికి సరైన నిర్వచనం చెబుతూ సాగిన రాజస్తాన్ రాయల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను సావగొట్టింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54, 9 ఫోర్లు), జోస్ బట్లర్ (22 బంతుల్లో 54, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంన్ (32 బంతుల్లో 55, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు దంచికట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్.. 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవాలంటే కొండను కరిగించాల్సిందే..
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. జైస్వాల్ బౌండరీతో ఖాతా తెరిచాడు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో బట్లర్.. ఓ భారీ సిక్సర్ కొట్టగా జైస్వాల్ రెండు బౌండరీలు కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన నాలుగో ఓవర్లో బట్లర్ మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లోనే రాజస్తాన్ స్కోరు 50 పరుగుల మార్క్ ను దాటింది.
నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో బట్లర్ నాలుగు ఫోర్లు బాదాడు. ఫజుల్లా ఫరూఖీ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బంతికి మరో బౌండరీ బాది ఐదో బాల్ కు బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్ ఏకంగా 85 పరుగులు చేసింది. పవర్ ప్లే లో రాజస్తాన్ కు ఇదే హయ్యస్ట్ స్కోరు.
శాంసన్ వచ్చెన్.. నిలిచి బాదెన్
బట్లర్ స్థానంలో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ ఏం తక్కువ తిన్లేదు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శాంసన్.. అతడే వేసిన తర్వాతి ఓవర్లో భారీ సిక్సర్ కూడా బాదాడు. 8 ఓవర్లకే వంద పరుగులు చేసిన రాజస్తాన్.. పది ఓవర్లు ముగిసేసరికి 122 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా జైస్వాల్ కూడా అర్థ సెంచరీ (34 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.
శాంసన్-జైస్వాల్ లు రెండో వికెట్ కు 54 పరుగులు జోడించారు. కానీ ఫజుల్లా ఫరూఖీ హైదరాబాద్ కు మరో బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన 13వ ఓవర్లో మూడో బంతికి జైస్వాల్. మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 15వ ఓవర్లో దేవదత్ పడిక్కల్ (2) కూడా బౌల్డ్ అయ్యాడు. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో రియాన్ పరాగ్ (7) కూడా ఫరూఖీకి క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో సామ్సన్.. మూడో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే నటరాజన్ వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మ కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో షిమ్రన్ హెట్మెయర్ (16 బంతుల్లో 22 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ .. 203 పరుగుల వద్ద నిలిచింది. మరి ఈ కొండంత లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదిస్తుందా..? హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, ఫరూఖీ తలా రకెండు వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్ కు ఒక వికెట్ దక్కింది.
