Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2023: వచ్చి రాగానే కెమెరా పగులకొట్టిన జో రూట్... రాయల్‌గా ఆడిన మొదటి బంతికే...

మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్న జో రూట్... ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున బరిలో దిగుతున్న ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్.. 

IPL 2023: Joe Root breaks camera after facing 1st ball as Rajasthan Royals player cra
Author
First Published Mar 28, 2023, 1:47 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ఫ్యాబ్4 ప్లేయర్లను చూసే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది. స్టీవ్ స్మిత్, ఐపీఎల్‌ 2023 వేలంలో పేరు నమోదు చేసుకోకున్నా... కామెంటేటర్‌గా వస్తుంటే, విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియంసన్ ప్లేయర్లుగా ఆడబోతున్నారు... 2012లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్, 2023 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు...

ఐపీఎల్ వేలంలో ప్రతీసారీ పేరు రిజిస్టర్ చేయించుకోవడం, టెస్టు ప్లేయర్ కావడంతో జో రూట్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం జరుగుతూ వచ్చాయి. ఇంగ్లాండ్ వన్డే, టీ20 టీమ్‌లో కూడా చోటు కోల్పోయిన జో రూట్‌ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కొనే సాహసం చేయలేకపోయాయి...

అయితే ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్‌లో జో రూట్‌ని బేస్ ప్రైజ్ 1 కోటి రూపాయలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. జో రూట్‌ ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో 32 టీ20 మ్యాచులు ఆడి 35.72 సగటుతో 127 స్ట్రైయిక్ రేటుతో 893 పరుగులు చేశాడు. టీ20ల్లో జో రూట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 90 పరుగులు నాటౌట్.  ఐపీఎల్ ఆడేందుకు తెగ ఉత్సాహపడుతున్న  జో రూట్, రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో ఇప్పటికే చేరిపోయాడు...

ప్రతీ ప్లేయర్‌కి అవకాశం ఇస్తూ వారిని ప్రోత్సహించడంలో ముందు ఉండే టీమ్ రాజస్థాన్ రాయల్స్. దీంతో ఈసారి జో రూట్‌కి కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జైపూర్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న జో రూట్, మొదటి బంతికే కెమెరాని పగులకొట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రాజస్థాన్ రాయల్స్...

‘మార్చి 26, 2023. రాయల్‌గా జో రూట్ మొట్టమొదటి బాల్ ...’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేసింది రాజస్థాన్ రాయల్స్. గత సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది రాజస్థాన్ రాయల్స్. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన సంజూ శాంసన్ టీమ్, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి ఆ ఒక్క అడుగును దాటి టైటిల్ గెలవాలని బలంగా నిర్ణయించుకుంది రాజస్థాన్ రాయల్స్...

జో రూట్‌తో పాటు సిమ్రాన్ హెట్మయర్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ సేన్, ఓబెడ్ మెక్‌కాయ్, యజ్వేంద్ర చాహాల్, ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్ వంటి ప్లేయర్లు, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఉన్నారు. వీరిలో ట్రెంట్ బౌల్ట్, జోస్ బట్లర్ తుది జట్టులో పక్కా ఉంటారు. వీరితో పాటు సిమ్రాన్ హెట్మయర్‌ని హిట్టర్‌గా ఆడించనుంది రాజస్థాన్ రాయల్స్. 

యశస్వి జైస్వాల్‌తో కలిసి జోస్ బట్లర్ ఓపెనింగ్ చేస్తున్నాడు. మూడో స్థానంలో సంజూ శాంసన్ బ్యాటింగ్‌కి వస్తున్నాడు. జో రూట్‌ని ఆడించాలంటే నాలుగో స్థానంలో ఆడించాల్సి ఉంటుంది. అలా చేస్తే దేవ్‌దత్ పడిక్కల్‌కి తుది జట్టులో చోటు దక్కదు. 

Follow Us:
Download App:
  • android
  • ios