IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. వరుస విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్..  మరోసారి శార్దూల్‌పైనే భారం వేసిన కేకేఆర్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తాత్కాలిక కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హార్ధిక్ పాండ్యా అనారోగ్యానికి గురి కావడంతో నేటి మ్యాచ్‌కి రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 2023 సీజన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెండో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.ఇంతకుముందు ఇలాగే లక్నో సూపర్ జెయింట్స్‌పైన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్, 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది..

అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2023 సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండు విజయాలను అందుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో చిత్తుగా ఓడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 81 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది..

అయితే ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆర్ టాపార్డర్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ ‘సునామీ’ ఇన్నింగ్స్ కారణంగా 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న నితీశ్ రాణాతో పాటు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ నుంచి కూడా ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు..

ఆండ్రూ రస్సెల్ కూడా మొదటి రెండు మ్యాచుల్లో మెరుపులు మెరిపించలేకపోయాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన యంగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి స్పిన్నర్లు, సొంత మైదానంలో చెలరేగిపోయారు. అయితే అహ్మదాబాద్‌లో వీరి బౌలింగ్‌ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం..

మరోవైపు గత సీజన్ నుంచి వరుస విజయాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తోంది గుజరాత్ టైటాన్స్. నేటి మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యాప్లేస్‌లో విజయ్ శంకర్‌కి తుది జట్టులో చోటు కల్పించింది గుజరాత్ టైటాన్స్...

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహార్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జెరీ జోసఫ్, యష్ దయాల్ 

మరోవైపు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రెండు మార్పులతో బరిలో దిగుతోంది. టిమ్ సౌథీ ప్లేస్‌లో లూకీ ఫర్గూసన్‌కి అవకాశం ఇచ్చిన కేకేఆర్, మన్‌దీప్ సింగ్ ప్లేస్‌లో నారాయణ్ జగదీశన్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది. గుర్భాజ్‌తో కలిసి జగదీశన్ ఓపెనింగ్ చేస్తాడు.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్: రహ్మనుల్లా గుర్భాజ్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాశ్ శర్మ, లూకీ ఫర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి