IPL 2023: సన్ రైజర్స్   హైదరాబాద్ తో  అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. 

టీమిండియా ఓపెనర్, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న శుభ్‌మన్ గిల్ ఈ లీగ్ లో తొలి సెంచరీ నమోదుచేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గిల్.. 56 బంతుల్లోనే 13 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 100 పరుగులు చేసి తన కెరీర్ లో బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. గిల్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్నది. 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

ఐపీఎల్ లోకి 2018లో ఎంట్రీ ఇచ్చిన గిల్.. నాలుగు సీజన్ల పాటు కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడాడు. 2022 కు ముందు గుజరాత్ కు మారిన గిల్ ఆ సీజన్ లో 16 మ్యాచ్ లలో 483 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో అతడికి సెంచరీ చేసే అవకాశం ఒకసారి వచ్చింది. కానీ 96 పరుగుల వద్దే ఆగిపోయిన గిల్.. ఈ సీజన్ లో కూడా లక్నోతో మ్యాచ్ లో 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కానీ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో దూకుడుగా ఆడి సెంచరీ కొరతను తీర్చుకున్నాడు.

Scroll to load tweet…

ఈ సెంచరీ ద్వారా అతడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఫస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. కాగా ఈ ఏడాది గిల్.. వన్డేలలో డబుల్ సెంచరీ, టెస్టులలో సెంచరీ, టీ20లలోనూ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా గిల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం.