IPL 2023: గడిచిన వారంలో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లు ఐపీఎల్ అభిమానులను అలరిస్తున్న వేళ నేడు అహ్మదాబాద్ లో కూడా అలాంటిదే మరో రసవత్తరపోరు జరిగింది. గుజరాత్ నిలిపిన 178 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.
రోజులు గడుస్తున్న కొద్దీ ఐపీఎల్ లో ఉత్కంఠతో సాగే మ్యాచ్ ల సంఖ్య పెరిగిపోతోంది. విజయం కోసం ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ప్రత్యర్థి తమ ముందు ఎంత లక్ష్యాన్ని నిలిపినా దానిని ఛేదించేదాకా వదిలేదేలే ద అన్న రీతిలో ముందుకు సాగుతున్నాయి. గడిచిన వారంలో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లు ఐపీఎల్ అభిమానులను అలరిస్తున్న వేళ నేడు అహ్మదాబాద్ లో కూడా అలాంటిదే మరో రసవత్తరపోరు జరిగింది. గుజరాత్ నిలిపిన 178 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఛేదనలో 55 కే 4 కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ను సంజూ శాంసన్ (32 బంతుల్లో 60, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), షిమ్రన్ హెట్మెయర్ (26 బంతుల్లో 56 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) లు ధాటిగా ఆడ రాజస్తాన్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే గాక గతేడాది ఫైనల్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.
178 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ కు ఆరంభంలోనే డబుల్ షాకులు తాకాయి. ఫామ్ లో ఉన్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1), జోస్ బట్లర్ (0) దారుణంగా విఫలమయ్యారు. హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో మూడో బంతికి జైస్వాల్.. శుభ్‌మన్ గిల్ కు క్యాచ్ ఇవ్వగా షమీ వేసిన మూడో ఓవర్లో బట్లర్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రాజస్తాన్.. 3 ఓవర్లలో నాలుగు పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న శాంసన్..
నాలుగు పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ను సంజూ శాంసన్ ఆదుకున్నాడు. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 26, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి మూడో వికెట్ కు 43 పరుగులు జోడించాడు. షమీ బౌలింగ్ లో బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన పడిక్కల్.. హార్ధిక్ పాండ్యా వేసిన ఆరో ఓవర్లో కూడా లాంగాఫ్ మీదుగా మరో సిక్సర్ బాది జోరు మీద కనిపించాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఏడో ఓవర్లో శాంసన్ కూడా సిక్సర్ బాదాడు. కానీ రషీద్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (5) కూడా విఫలమయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 4 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గేర్ మార్చిన శాంసన్.. దంచికొట్టిన హెట్మెయర్
చేధించాల్సిన లక్ష్యం తాలూకూ రన్ రేట్ పెరిగిపోతుండటంతో శాంసన్ హిట్టంగ్ కు దిగాడు. రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో శాంసన్ 3 భారీ సిక్సర్లు బాదాడు. ఆ మరుసటి ఓవర్లోనే హెట్మెయర్ 6,4 కొట్టాడు. 14 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు వంద పరుగులకు చేరుకుంది. నూర్ అహ్మద్ వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్.. అదే ఓవర్లో నాలుగు, ఐదు బంతులను 6,4 గా మలిచాడు. కానీ ఆఖరి బంతిని లాంగాఫ్ మీదుగా ఆడబోయి షాట్ సరిగా కనెక్ట్ కాకపోవడంతో అక్కడే ఉన్న డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు.
ఆఖరి 5 ఓవర్లలో..
చివరి 5 ఓవర్లలో 63 పరుగులు అవసరమవగా శాంసన్ స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ (18) ను మరో ఎండ్ లో నిల్చోబెట్టి హెట్మెయర్ బ్యాట్ కు పనిచెప్పాడు. జోసెఫ్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన హెట్మెయర్.. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 4, 6 బాదాడు. షమీ వేసిన 19వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టిన జురెల్.. తర్వాతి బంతికి నిష్క్రమించాడు. అప్పటికీ రాజస్తాన్ 10 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది. జురెల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అశ్విన్.. 4, 6 బాది గుజరాత్ కు కావాల్సిన నష్టాన్ని చేసిపెట్టాడు. ఆడిన మూడో బాల్ కే అవుట్ అయినా అప్పటికే రాజస్తాన్ విజయం ఖాయమైపోయింది. ఇక చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా.. హెట్మెయర్ భారీ సిక్సర్ తో రాజస్తాన్ కు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ల వైఫల్యంతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45) ఆరంభంలో రాణించాడు. మిడిల్ ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. కానీ చివర్లో అభినవ్ మనోహర్ (27), డేవిడ్ మిల్లర్ (46) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
