IPL 2023, GT vs LSG: ఐపీఎలీ-16లో  గుజరాత్ టైటాన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హార్థిక్ సేన భారీ స్కోరు సాధించింది. 

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు లక్నో బౌలింగ్ ను ఉతికారేస్తూ.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేశారు. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ( 43 బంతుల్లో 81, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ల తో పాటు ఆఖర్లో డేవిడ్ మిల్లర్ కూడా రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. మరి కృనాల్ పాండ్యా అండ్ కో. 228 పరుగుల టార్గెట్ ను ఛేదిస్తుందా..? 

టాస్ ఓడి ఫస్ట్ బ్యటింగ్ కు వచ్చిన గుజరాత్‌‌కు ఓపెనర్లు గిల్ - సాహాలు రాక్ సాలిడ్ పునాధి వేశారు. ఈ ఇద్దరూ 12.1 ఓవర్లలోనే ఏకంగా 142 పరుగులు జోడించి గుజరాత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన సాహా.. అవుట్ అయ్యేవరకూ దానిని కొనసాగించాడు. 

సాహా కసితీరా.. 

మోహ్సిన్ ఖాన్ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే సాహా రెండు ఫోర్లు కొట్టాడు. అవేశ్ ఖాన్ విసిరిన రెండో ఓవర్లో 6, 4 బాదిన అతడు మోహ్సినే వేసిన నాలుగో ఓవర్లో అయితే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 4 తో 22 పరుగులు పిండుకున్నాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్లో సిక్స్ కొట్టిన సాహా.. 20 బంతులలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గుజరాత్ కు ఇదే హయ్యస్ట్ ఫిఫ్టీ. ఇదే సీజన్ లో విజయ్ శంకర్.. కేకేఆర్ పై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును సాహా బ్రేక్ చేశాడు. సాహా విజృంభణతో పవర్ ప్లే లోనే గుజరాత్ స్కోరు 78 పరుగులకు చేరింది. 

హాఫ్ సెంచరీ తర్వాత సాహా.. కైల్ మేయర్స్ వేసిన 8వ ఓవర్లో 4, 4, 4తో 16 పరుగులు రాబట్టాడు. ఇక ఆ తర్వాత బాదడం గిల్ వంతైంది. బిష్ణోయ్ వేసిన 9వ ఓవర్లో గిల్ రెండు సిక్సర్లు కొట్టాడు. కృనాల్ పాండ్యా వేసిన 12వ ఓవర్లో గిల్.. సింగిల్ తీసి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ తర్వాత అవేశ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు సాహా.. ప్రేరక్ మన్కడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 142 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ కోహ్లీ - డుప్లెసిస్ లు ఈ సీజన్ ఆరంభంలో ముంబై మీద నెలకొల్పిన 142 పరుగుల రికార్డును బ్రేక్ చేశారు. 

సాహా నిష్క్రమించాక బాదుడు పనిని గిల్ తీసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా.. స్టోయినిస్ బౌలింగ్ లో 4,6 తో ఊపుమీదే కనిపించినా మోహ్సిన్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో ఆఖరు బంతికి కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో గిల్ కు డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ ) కూడా ధాటిగానే ఆడాడు. అయితే చివరి ఓవర్లో ఫస్ట్ బాల్ కు సిక్సర్ బాది 90లలోకి వచ్చిన గిల్ సెంచరీ చేస్తాడని అనిపించింది. కానీ తర్వాత అతడు మరో మూడు పరుగులు మాత్రమే చేయడంతో 94 వద్దే ఆగిపోవాల్సి వచ్చింది.