IPL 2023, Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అని వెనుకటికి తెలుగులో ఒక సామెత ఉండేది. ఈ సామెత ఢిల్లీ క్యాపిటల్స్‌కు అతికినట్టు సరిపోతుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడింది.
దూకుడుగా ఆడే ఓపెనర్లు.. సాలిడ్ మిడిలార్డర్.. లోయరార్డర్ లో 7వ స్థానం దాకా మెరుపులు మెరిపించగల బ్యాటర్లు.. అంతర్జాతీయ స్థాయి ఆల్ రౌండర్లకు కొదవలేదు.. టీ20లో ప్రపంచంలోనే టాప్ బౌలర్లు.. బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న కెప్టెన్ హెడ్ కోచ్ (పాంటింగ్).. భారత జట్టు దిశ, దశను మార్చి బీసీసీఐని ఏలిన మాజీ అధ్యక్షుడు (గంగూలీ) మెంటార్.. చూడటానికి ‘వామ్మో’ అనిపించే స్థాయిలో ఉన్న జట్టు ఎలా ఆడాలి..? కానీ సదరు టీమ్ మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఐపీఎల్ -16లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఓడింది. అందుకే ఆ జట్టును నెటిజన్లు ‘ఢిల్లీ క్యాపిటల్స్ అంటార్రా బాబు’ అంటూ ఆటాడుకుంటున్నారు.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అని వెనుకటికి తెలుగులో ఒక సామెత ఉండేది. ఈ సామెత ఢిల్లీ క్యాపిటల్స్‌కు అతికినట్టు సరిపోతుంది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్‌ను పట్టుకున్న దరిద్ర దేవత ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆవహించిందా..? అన్నంత అనుమానం కలిగేలా అత్యంత దారుణమైన ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్నది ఢిల్లీ.
లోపాలు ఎక్కడ..?
- ఢిల్లీ క్యాపిటల్స్ గత మూడు, నాలుగు సీజన్లలో నిలకడైన ప్రదర్శనలు చేసిందంటే దానికి కారణం ఆ జట్టు ఓపెనర్లు. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా.. ఈ సీజన్ లో క్రీజులో కంటే పెవిలియన్ లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఐపీఎల్ - 16లో షా ఆడిన ఐదు మ్యాచ్ లలో చేసిన స్కోర్లు ఇవి 0, 15, 0, 7, 12.
- వార్నర్ రాణిస్తున్నా అతడు మరీ ధాటిగా ఆడటం లేదు. వరుసగా వికెట్లు పడుతుండటంతో అతడు నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని పాటిస్తున్నాడు. ఈ సీజన్ లో వార్నర్.. ఐదు మ్యాచ్ లలో 228 పరుగులతో అత్యధిక పరుగుల వీరులలో రెండో స్థానంలో ఉన్నా.. అవి అతడి జట్టుకు విజయాలను అందించలేకపోతున్నాయి.
- వన్ డౌన్ లో వచ్చే మిచెల్ మార్ష్ కూడా ఆడిన మూడు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ (0, 4, 0) కే వెనుదిరిగుతున్నాడు. అండర్ -19 వరల్డ్ కప్ విన్నర్ యశ్ ధుల్ కూడా రెండు మ్యాచ్ లలో రెండు పరుగులే చేశాడు.
- తొలి మ్యాచ్ లో వికెట్ కీపర్ గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ విఫలమవడంతో అతడి స్థానంలో వచ్చిన అభిషేక్ పొరెల్ కూడా బ్యాటింగ్ లో రిషభ్ పంత్ ను మరిపించలేకపోతున్నాడు.
- కాస్తో కూస్తో అక్షర్ పటేల్ ఫర్వాలేదనిపిస్తున్న అతడి ఆట ఢిల్లీని గెలిపించలేకపోతోంది. గత సీజన్ లో ఢిల్లీ తరఫున కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడిన రొవ్మన్ పావెల్ ఈ సీజన్ లో విఫలమయ్యాడు.
బౌలర్లు మరీ దారుణం..
బ్యాటింగ్ కథ ఇలా ఉంటే బౌలింగ్ లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఢిల్లీ బౌలర్లపై ప్రత్యర్థి బ్యాటర్లు ఆది నుంచే ఎదురుదాడికి దిగుతున్నారు. ఖలీల్ అహ్మద్, ముఖేశ్ చౌదరి, చేతన్ సకారియా.. ఇలా మ్యాచ్ లో బౌలర్లు మారుతున్నా ఢిల్లీ రాత మారలేదు. తొలి రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్నా ఆన్రిచ్ నోర్జే, ముష్ఫీకర్ రహీమ్ వచ్చినా ప్రత్యర్థి పరుగుల దాహానికి వీళ్లూ బలౌతున్నారు. బ్యాటింగ్ లో రాణిస్తున్నా అక్షర్ బౌలింగ్ లో తన ప్రభావం చూపలేకపోతున్నాడు. కుల్దీప్ కూడా మాయ చేసింది అంతంతమాత్రమే.
ప్లేఆఫ్స్ గోవిందా..!
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదులుకుంది. ఒకవేళ ఆ జట్టు పుంజుకున్నా ప్లేఆఫ్ చేరాలంటే ఢిల్లీ రాబోయే 9 మ్యాచ్ లలో విజయాలతో పాటు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయినా ప్రస్తుతం ఢిల్లీ ఫామ్ ను చూస్తే ఆ జట్టు ఈ సీజన్ లో పదో స్థానం కాకుండా 8,9 లలో ఉండటం కూడా అనుమానమే...!
