IPL 2023: 94 పరుగులు చేసి ఆఖరి బంతి వరకూ పోరాడిన లియామ్ లివింగ్‌స్టోన్... అథర్వ‌ని రిటైర్డ్ అవుట్‌గా చేసి, భారీ మూల్యం చెల్లించుకున్న పంజాబ్ కింగ్స్.. 

ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న క్యాపిటల్స్... 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరాలనుకున్న పంజాబ్ కింగ్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది..

ఢిల్లీ చేతుల్లో 15 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్స్ రేసులో ఉన్నా టాప్ 4లో ముగించాలంటే అద్భుతం జరగాల్సిందే. సీజన్‌లో ఐదో విజయం అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆఖరి పొజిషన్ నుంచి కాస్త పైకి ఎక్కి 9వ స్థానంలో నిలిచింది.

214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ సెంచరీ హీరో ప్రభుసిమ్రాన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఖలీల్ అహ్మద్‌కి మెయిడిన్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మొదటి బంతికే శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు.

సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. 19 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన అథర్వ టైడ్... చేయాల్సిన రన్‌ రేట్ పెరిగిపోవడంతో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. 

జితేశ్ శర్మ 3 బంతులాడి డకౌట్ కాగా వస్తూనే సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో ‌11 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాతి బంతికి హర్‌ప్రీత్ బ్రార్ రనౌట్ అయ్యాడు. కీలకమైన 19వ ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 5 పరుగులే రాబట్టగలిగింది. దీంతో చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 33 పరుగులు కావాల్సి వచ్చాయి..

మొదటి బంతికి పరుగులేమీ రాకపోవడంతో పంజాబ్ కింగ్స్ ఓటమి ఖాయమైపోయింది. రెండో బంతికి సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, ఆ తర్వాతి వరుసగా 4, 6 బాదాడు. అయితే నో బాల్‌ రావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. అయితే ఫ్రీ హిట్‌లో లివింగ్‌స్టోన్ షాట్ ఆడలేకపోయాడు.

ఆ తర్వాతి బంతికి కూడా పరుగులేమీ రాకపోవడంతో ఆఖరి బంతికి సిక్సర్‌కి ప్రయత్నించిన లియామ్ లివింగ్‌స్టోన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్..

39 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ని రాహుల్ చాహార్ జారవిడిచాడు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లోనే వార్నర్ అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

వస్తూనే రెండు బౌండరీలు బాదిన రిలే రసో, రబాడా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 4, 6 బాది 17 పరుగులు రాబట్టాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన పృథ్వీ షా, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

25 బంతుల్లో ఐపీఎల్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న రిలే రసో, ఫిలిప్ సాల్ట్‌తో కలిసి 30 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన రిలే రసోతో పాటు 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ బాదుడుకి ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 200 మార్కు దాటేసింది..