IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్... ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్, చివరి రెండు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని హెచ్‌పీసీఏ క్రికెట్ స్టేడియంలో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ రెండు జట్లు నాలుగు రోజుల ముందు ఢిల్లీలో తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో ప్రభుసిమ్రాన్ సింగ్ సెంచరీతో చెలరేగినా మిగిలిన బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ కావడంతో పంజాబ్ కింగ్స్ 167 పరుగులే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో 8 ఓవర్లలో 80 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో 136 పరుగులకే పరిమితమైంది..
ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. దీంతో నేటి మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా పరువు కాపాడుకోవాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్.
మరోవైపు 12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అయితే నేటి మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఛాన్సులు మెరుగుపడతాయి. నేటి మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 14 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం అందుకుంటే ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు పెరుగుతాయి..
ఢిల్లీ క్యాపిటల్స్ ఇది ప్రెస్టేజీ ఇష్యూ అయితే, పంజాబ్ కింగ్స్ డూ ఆర్ డై మ్యాచ్. ప్రభుసిమ్రాన్ సింగ్‌తో పాటు యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నారు. సికందర్ రజా బాగానే ఆడుతున్నా వరుస అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు.. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతని తుది జట్టులోకి తీసుకురావచ్చు.
గత మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన హర్‌ప్రీత్ బ్రార్, నేటి మ్యాచ్‌లోనూ కీలకం కాబోతున్నాడు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబాడా, సామ్ కుర్రాన్‌ల నుంచి ఆశించిన ఇన్నింగ్స్‌లు అయితే రావడం లేదు. ఈ ముగ్గురు ఫారిన్ స్టార్లు అదరగొడితే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరకుండా ఆపడం చాలా కష్టమైపోతుంది..
మరోవైపు మొదటి ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్... మళ్లీ డేవిడ్ వార్నర్‌పైనే ఆధారపడుతోంది. ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, రిలే రసో కొన్ని మ్యాచుల్లో బాగానే ఆడినా నిలకడగా రాణించడం లేదు.
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ ఆకట్టుకుంటున్నా.. మనీశ్ పాండే, లలిత్ యాదవ్ వరుసగా ఫెయిల్ అవుతున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ టైడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కుర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహార్, కగిసో రబాడా, నాథన్ ఎల్లీస్, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్, రిలే రసో, అక్షర్ పటేల్, ఆమన్ హకీం ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, ఆన్రీచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
