అవును.. ఐపీఎల్‌ను మిస్ అవుతున్నా.. ఫ్రాంచైజీ కూడా బాగా డిసప్పాయింట్ అయింది : డేవిడ్ మిల్లర్
IPL 2023: గతేడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రారంభ ఎడిషన్ లోనే ట్రోఫీ నెగ్గిన జట్టు గుజరాత్ టైటాన్స్. ఈసారి కూడా ఆ జట్టు మరోసారి టైటిల్ నెగ్గాలని భారీ ఆశలు పెట్టుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ ఎడిషన్ కు మరో పది రోజుల్లో తెరలేవనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్న గుజరాత్ జెయింట్స్.. మార్చి 31న తమ తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొనబోతుంది. తొలి మ్యాచ్ లోనే గెలిచి టోర్నీలో ముందంజ వేయాలని గుజరాత్ భావిస్తున్నది. కానీ గుజరాత్ కు ఆ జట్టు ఆల్ రౌండర్ డేవిడ్ మిల్లర్ భారీ షాకిచ్చాడు.
త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్ కొత్త ఎడిషన్ లో జరుగబోయే తొలి మ్యాచ్ తో పాటు తర్వాతి మ్యాచ్ కు కూడా తాను అందుబాటులో ఉండటం లేదని మిల్లర్ తెలిపాడు. ఏప్రిల్ 03 తర్వాతే ఈ లీగ్ లోకి అడుగుపెడతానని చెప్పాడు.
పోచెఫ్స్ట్రోమ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిల్లర్ మాట్లాడుతూ... ‘అవును. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ తో పాటు తర్వాతి మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండలేకపోతున్నా. ఈ విషయం చెప్పగానే టీమ్ మేనేజ్మెంట్ కూడా బాగా డిసప్పాయింట్ అయింది. అహ్మదాబాద్ లో ఆడటం చాలా పెద్ద విషయం. ఓపెనింగ్ మ్యాచ్ కు మిస్ అవుతున్నందుకు నేను కూడా చాలా నిరాశచెందా. కానీ అదే సమయంలో నేను నా జాతీయ జట్టు తరఫున నెదర్లాండ్స్ తో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇవి మాకు చాలా కీలకం. అందుకే మా టీమ్ లో చాలా మంది ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్లు నెదర్లాండ్స్ తో ఆడుతున్నాం. నేను ఏప్రిల్ 3 తర్వాత ఐపీఎల్ కు అందుబాటులో ఉంటా...’నని చెప్పాడు.
కాగా.. ఐపీఎల్ ప్రారంభ సమయానికే దక్షిణాఫ్రికాలో నెదర్లాండ్స్ తో రెండు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ లు నెగ్గడం సఫారీలకు చాలా అవసరం. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించాలంటే ఆ జట్టుకు ఈ సిరీస్ లో గెలుపొందడం అత్యావశ్యకం. మార్చి 31 నుంచి నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా రెండు వన్డేల సిరీస్ మొదలుకానుంది. బెనోని, జోహన్నస్‌బర్గ్ వేదికగా రెండు వన్డేలు జరుగుతాయి. ఈ మ్యాచ్ ల కోసం దక్షిణాఫ్రికా పూర్తిస్థాయి జట్టును బరిలోకి దించుతున్నది. ఎయిడెన్ మార్క్‌రమ్, అన్రిచ్ నోర్త్జ్, డేవిడ్ మిల్లర్, కగిసొ రబాడా, హెన్రిచ్ క్లాసెన్, క్వింటన్ డికాక్ వంటి ప్లేయర్లంతా నెదర్లాండ్స్ తో సిరీస్ ఆడనున్నారు.
ఈ నేపథ్యంలో తొలి వారం రోజుల పాటు ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ లకు వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్న తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని.. సీఎస్ఎ, బీసీసీఐకి తెలియజేసింది. దీనికి బీసీసీఐ కూడా సమ్మతించింది.
ఇక ఈ సీజన్ తొలి మ్యాచ్ (మార్చి 31) లో చెన్నైతో తలపడే గుజరాత్.. ఆ తర్వాత ఏప్రిల్ 4న ఢిల్లీతో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు కూడా మిల్లర్ ఆడేది అనుమానమే.