టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... స్టార్లు లేకుండా బరిలో ఇరు జట్లు.. బెన్ స్టోక్స్‌కి గాయం! జోఫ్రా ఆర్చర్‌కి రెస్ట్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ El Clasico అని పిలిచే ఈ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ ఉంది.
మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ముంబై ఇండియన్స్... కిరన్ పోలార్డ్ రిటైర్ కావడం, జస్ప్రిత్ బుమ్రా, జే రిచర్డ్‌సన్ గాయపడడంతో ముంబై ఇండియన్స్ కాస్త బలహీనంగా మారింది. అంతేకాకుండా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేరు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
భారీ అంచనాలు పెట్టుకున్న కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ కూడా పెద్దగా రాణించలేకపోయారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా ఆర్‌సీబీ 170+ టార్గెట్ పెట్టినా, బౌలర్ల ఫెయిల్యూర్‌తో ముంబై ఇండియన్స్‌కి ఓటమి తప్పలేదు. భారీ ఆశలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ మొదటి మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాడు.. జోఫ్రా ఆర్చర్‌ని నేటి మ్యాచ్‌కి దూరంగా పెట్టింది ముంబై ఇండియన్స్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో సొంత మైదానాల్లో జరిగిన మ్యాచుల్లో ఫ్రాంఛైజీలు విజయాలు అందుకుంటున్నాయి. ఒక్క హైదరాబాద్, ఢిల్లీ తప్ప మిగిలిన టీమ్స్ అన్నీ కూడా సొంత మైదానాల్లో విజయాలు అందుకున్నాయి. దీంతో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి, బోణీ కొట్టాలని ఆశపడుతోంది ముంబై ఇండియన్స్...
మరోవైపు తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడినా, లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయాన్ని అందుకుని, ఐపీఎల్ 2023 సీజన్‌లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. రుతురాజ్ గైక్వాడ్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ కూడా అదరగొట్టారు. అయితే మొయిన్ ఆలీ నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు.
అయితే భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ రాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. బెన్ స్టోక్స్ ప్లేస్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింకా రహానే, మొయిన్ ఆలీ ప్లేస్‌లో డ్వేన్ పెట్రోరియస్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్..
ముంబై ఇండియన్స్ జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింకా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహార్, మిచెల్ సాంట్నర్, సిసండ మగల, తుషార్ దేశ్‌పాండే
