ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ బాదిన డివాన్ కాన్వే... శివమ్ దూబే మెరుపు హాఫ్ సెంచరీ! సిక్సర్ల మోత మోగించిన అజింకా రహానే...
ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడినా కోల్‌కత్తా నైట్ రైడర్స్ బౌలర్ల తీరు మారలేదు. మరోసారి కేకేఆర్ బౌలర్లు చేతులు ఎత్తేయడంతో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఇరగదీశారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది...
ఫోర్‌తో ఇన్నింగ్స్‌ని మొదలెట్టాడు రుతురాజ్ గైక్వాడ్. మొదటి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి యంగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
34 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న డివాన్ కాన్వే, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసిన డివాన్ కాన్వే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డేవిడ్ వీజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
అదే ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు శివమ్ దూబే. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అజింకా రహానే వరుసగా 6, 6,4 బాదాడు. దీంతో 5 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగులు రాబట్టింది...
ఉమేశ్ యాదవ్ మొదటి 2 ఓవర్లలో 13 పరుగులే ఇవ్వగా ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు సీఎస్‌కే బ్యాటర్లు అజింకా రహానే, శివమ్ దూబే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌లోకి వచ్చి 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన అజింకా రహానే, నేటి మ్యాచ్‌లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
మరో ఎండ్‌లో శివమ్ దూబే 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. మూడో వికెట్‌కి అజింకా రహానేతో కలిసి 33 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శివమ్ దూబే, 21 బంతుల్లో 50 పరుగులు చేసి కుల్వంత్ కెజ్రోలియా బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4 బాదిన అజింకా రహానే 19 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన రవీంద్ర జడేజా, 8 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆఖరి రెండు బంతుల్లో బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... నో బాల్ కోసం రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు...
ఫ్రీ హిట్ బాల్‌ని బాదడంలో ఫెయిల్ అయిన ధోనీ, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 2 పరుగులు తీశాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసిన అజింకా రహానే అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు.
