IPL 2023, RCB vs RR: ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్.. చివరి ఓవర్ దాకా పోరాడింది. కానీ విజయం మాత్రం ఆర్సీబీదే.
ఈ ఐపీఎల్ సీజన్ కు మరో పేరు ఏమైనా పెట్టదలుచుకుంటే ‘లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ సీజన్’అని పెట్టాలేమో.. ఒక్కటా రెండా.., ఫస్ట్ వారం ఫలితాలు మినహాయిస్తే రెండో వారం నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్ ఫలితం లాస్ట్ ఓవర్ లోనే తేలుతుంది. దీనికి ఆదివారం బెంగళూరు వేదికగా ముగిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు - రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ కూడా మినహాయింపేమీ కాదు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్.. చివరి ఓవర్ దాకా పోరాడింది. కానీ విజయం మాత్రం ఆర్సీబీదే. లక్ష్య ఛేదనలో రాజస్తాన్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులే చేసింది. ఫలితంగా ఆర్సీబీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్తాన్ కు ఇది వరుసగా రెండో పరాజయం.
190 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ వలే రాజస్తాన్ కు కూడా ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తాకింది. ప్రమాదకర ఓపెనర్ జోస్ బట్లర్.. సిరాజ్ వేసిన రాజస్తాన్ ఇన్నిగ్స్ ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్‌కే డకౌట్ అయ్యాడు. సిరాజ్ వేసిన ఔట్ స్వింగర్ కు బట్లర్ బౌల్డ్ అయ్యాడు.
సూపర్ పార్ట్‌నర్‌షిప్..
బట్లర్ నిష్కమ్రణతో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (34 బంతుల్లో 52, 7 ఫోర్లు, 1 సిక్స్).. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (37 బంతులలో 47, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో జతకలిశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 66 బంతుల్లోనే 98 పరుగులు జోడించారు. పవర్ ప్లే లో విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన ఐదో ఓవర్లో పడిక్కల్ 3 బౌండరీలు సాధించాడు. ఇక మ్యాక్స్‌వెల్ వేసిన ఆరో ఓవర్లో పడిక్కల్ ఫోర్ కొట్టగా జైస్వాల్ సిక్సర్ బాదాడు. అతడే వేసిన 8వ ఓవర్లో జైస్వాల్ 6, 4 సాధించాడు. వైశాఖ్ వేసిన పదో ఓవర్లో పడిక్కల్ రెండు ఫోర్లు కొట్టాడు. హసరంగ వేసిన 11వ ఓవర్లో నాలుగో బాల్ కు సింగిల్ తీసిన అతడు 30 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రాజస్తాన్ ను గెలుపు వైపునకు తీసుకెళ్తున్న ఈ జోడీని డేవిడ్ విల్లే విడదీశాడు. అతడు వేసిన 12వ ఓవర్లో పడిక్కల్.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో హర్షల్ పటేల్.. జైస్వాల్ ను వెనక్కి పంపాడు. హసరంగ వేసిన 15వ ఓవ్లో 4, 6 కొట్టిన సంజూ శాంసన్ (15 బంతుల్లో 22, 2 ఫోర్లు, 1 సిక్స్) .. హర్షల్ వేసిన 16వ ఓవర్లో షాబాజ్ అహ్మద్ చేతికి చిక్కాడు.
జురెల్ జోరు..
శాంసన్ నిష్క్రమణతో వచ్చిన ధ్రువ్ జురెల్ (16 బంతుల్లో 34 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. సిరాజ్ వేసిన 17వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన అతడు విల్ేల బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి హెట్‌మెయర్ (3) రనౌట్ అయ్యాడు. ఆ ఓవర్లో 12 పరుగులొచ్చాయి. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు అవసరం ఉండగా.. సిరాజ్ 19వ ఓవర్ లో 13 పరుగులిచ్చాడు. దాంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 20 గా మారింది.
ఆఖరి ఓవర్ ను కోహ్లీ.. హర్షల్ పటేల్ కు ఇచ్చాడు. ఫస్ట్ బాల్ కు అశ్విన్ ఫోర్ కొట్టాడు. రెండో బాల్ కు రెండు పరుగులు వచ్చాయి. మూడో బాల్‌కు మరో బౌండరీ. నాలుగో బాల్ కు అశ్విన్ ఔట్. ఐదో బాల్ కు అబ్దుల్ బాషిత్ ఒక్క పరుగే తీశాడు. దీంతో ఆర్సీబీ విజయం ఖాయమైపోయింది.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) లు రాణించారు. విరాట్ కోహ్లీ డకౌట్ అవగా మిగిలిన బ్యాటర్లూ డబుల్ డిజిట్ చేయడానికే తంటాలు పడ్డారు.
