IPL 2023: ఐపీఎల్ - 16 ను టెలివిజన్ లో ప్రసారం చేస్తున్న ప్రముఖ ఛానెల్ ‘స్టార్’ లో ప్రసారమైన ఓ షో వివాదాస్పదమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ ను టెలివిజన్‌లలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్’.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చేస్తున్న కార్యక్రమాలు జనాల ఆగ్రహానికి గురవుతున్నాయి. ఆట గురించి కాకుండా ఆటేతర విషయాల గురించి షో లు చేస్తున్నారంటూ ఆ టీవీ ఛానెల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి తలతిక్క షో లతో మహిళలను ఇబ్బంది పెట్టడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ -16 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం జరిగిన మ్యాచ్ కు ముందు ‘స్టార్1’ లో ‘హాట్ ఆర్ నాట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ తో కలిసి యాంకర్ సురేన్ సుందరం నిర్వహించిన ఈ షోలో ముగ్గురు ఫిమేల్ యాంకర్స్ కూడా పాల్గొన్నారు. వీరిలో ఒకరు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ కూడా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా స్క్రీన్ పై విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్) అర్ధనగ్న ఫోటోలను చూపించారు. వాళ్లు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలను ప్రదర్శిస్తూ ‘హాట్ ఆర్ నాట్’ చెప్పాలంటూ ఫిమేల్ యాంకర్స్ ను ప్రశ్నలు అడిగారు. కాగా ఈ ఫోటోలను చూసేందుకు లాంగర్ తో సహా మిగిలిన ఫిమేల్ యాంకర్స్ కూడా అసౌకర్యంగా ఫీలయ్యారు. మయాంతి అయితే ఆ ఫోటోలు చూడలేక ముఖం తిప్పుకుంది.
ఈ షో కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘క్రికెట్ మీద షోలు చేయడానికి ఇంకా మరే అంశాలు దొరకలేదా..?’, ‘మహిళా యాంకర్లను పెట్టి ఇవేం పిచ్చి పనుల్రా.. అసలు కొంచెమైనా సెన్స్ ఉందా..? ’ ‘నాకు స్టార్ మీద ఎప్పుడూ అంచనాలు లేవు. ఇది మరీ దరిద్రం. ఈ షోలో వాళ్లు (స్టార్) మహిళా యాంకర్లతో హాట్ ఆర్ నాట్ ఆడిస్తున్నారు. అసలు దీనికి ఆటతో ఏమైనా సంబంధం ఉందా..? వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారా..?’అని కామెంట్స్ చేస్తున్నారు.
