IPL 2023: కోల్కతా నైట్ రైడర్స్  చరిత్రలో ఇది రెండో సెంచరీ  మాత్రమే. తొలి సీజన్ లో  బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత  కేకేఆర్ తరఫున సెంచరీ చేసిన ఆటగాడు వెంకటేశే కావడం విశేషం. 

కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్.. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్ చరిత్రలో ఇది రెండో సెంచరీ మాత్రమే. తొలి సీజన్ లో బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత కేకేఆర్ తరఫున సెంచరీ చేసిన ఆటగాడు వెంకటేశే కావడం విశేషం. కేకేఆర్ అభిమానుల సెంచరీ కరువును 15 ఏండ్ల తర్వాత తీర్చిన అయ్యర్.. ఈ ఎడిషన్ లో రెండో సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మూడు రోజుల క్రితమే ఇదే కేకేఆర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్.. సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 

అయ్యర్ సెంచరీ నేపథ్యంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాను ఇక్కడ చూద్దాం. మొత్తంగా 16 సీజన్లలో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పై 9 మంది బ్యాటర్లు సెంచరీలు బాదారు. 

ముంబైపై శతక్కొట్టిన వీరే: 

- ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై ఫస్ట్ సెంచరీ చేసింది డెక్కన్ ఛార్జర్స్ సారథి ఆడమ్ గిల్‌క్రిస్టే కావడం గమనార్హం. ఇదే వాంఖేడే స్టేడియంలో గిల్‌క్రిస్ట్.. 2008 ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేశాడు. 47 బంతుల్లోనే గిల్లీ.. 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

- 2010వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్.. 37 బంతుల్లోనే శతకం బాదాడు.

- 2015వ సీజన్ లో ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ముంబైపై 59 బంతుల్లోనే 133 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

- 2017లో హషీమ్ ఆమ్లా.. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ ముంబైపై సెంచరీ చేశాడు.

- 2019లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు కెఎల్ రాహుల్.. ముంబై పై 64 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాహుల్.. 2022 సీజన్ లో కూడా ముంబైపై సెంచరీ చేశాడు. 

Scroll to load tweet…

- 2020 లో బెన్ స్టోక్స్.. రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతూ ముంబైపై 60 బంతుల్లో 107 పరుగులు సాధించాడు.

- 2022 సీజన్ లో రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్.. ముంబై పై 68 బంతుల్లో సెంచరీ చేశాడు. 

- 2023 సీజన్ లో వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేశాడు. 

ముంబై సెంచరీ వీరులు : 

కాగా ప్రత్యర్థులకు 9 సెంచరీలు ఇచ్చిన ముంబై ఇండియన్స్ ఈ లీగ్ లో చేసింది నాలుగు శతకాలే కావడం గమనార్హం. ఐపీఎల్ లీగ్ ప్రారంభ ఎడిషన్ 2008లో సనత్ జయసూర్య (చెన్నైపై), 2011లో సచిన్ టెండూల్కర్ (కొచ్చి టస్కర్స్ పై), 2012లో రోహిత్ శర్మ (కేకేఆర్ పై), 2014లో లెండి సిమ్మన్స్ (పంజాబ్ పై) లు సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు.