Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సూపర్ సెంచరీ... భారీ స్కోరు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండో సెంచరీ... ముంబై ఇండియన్స్‌పై సెంచరీ నమోదు చేసిన వెంకటేశ్ అయ్యర్.. భారీ స్కోరు దిశగా సాగుతున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్.. 

IPL 2023: 2nd Centurion of the Season, KKR Batter Venkatesh Iyer scores hundred against MI CRA
Author
First Published Apr 16, 2023, 5:04 PM IST

అయ్యర్ అదిరిపోయే సెంచరీతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండో సెంచరీ నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హారీ బ్రూక్, కేకేఆర్‌పై సెంచరీ సాధించగా.. కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్, ముంబై ఇండియన్స్‌పై అద్భుత శతకం నమోదు చేశాడు. 

నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్‌, ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదటి ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు స్వింగ్ కూడా చూపించి ఇంప్రెస్ చేశాడు... 

టాస్ ఓడి మొదలెట్టిన కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి శుభారంభం దక్కలేదు.  కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన నారాయణ్ జగదీశన్, హృతిక్ షోకీన్ పట్టిన సూపర్ క్యాచ్‌కి డకౌట్ అయ్యాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన రెండో ఓవర్‌లో ఓ 4, 6 బాదిన వెంకటేశ్ అయ్యర్.. 13 పరుగులు రాబట్టాడు..

12 బంతుల్లో 8 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్భాజ్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో జాన్సెన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 5 పరుగులు చేసిన నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీల మోత మోగించడంతో కేకేఆర్ స్కోరు వేగం ఎక్కడా తగ్గలేదు..

23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ అయ్యర్, రిలే మెడరిత్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రిలే మెడరిత్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 42 బంతుల్లో 94 పరుగులకి చేరుకున్న వెంకటేశ్ అయ్యర్, ఆ తర్వాత నెమ్మదిగా ఆడుతూ సింగిల్స్ తీసేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు

మరో ఎండ్‌లో రింకూ సింగ్ కూడా నెమ్మదిగా ఆడడంతో 14వ ఓవర్‌లో 5, 15 ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు వెంకటేశ్ అయ్యర్. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్. ఇంతకుముందు 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సెంచరీ చేశాడు..

బ్రెండన్ మెక్‌కల్లమ్, 2008 ఏప్రిల్ 18న ఆర్‌సీబీపై సెంచరీ సాధిస్తే.. వెంకటేశ్ అయ్యర్, సరిగ్గా 15 ఏళ్ల తర్వాత (2 రోజులు తక్కువ) ముంబై ఇండియన్స్‌పై సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, రిలే మెడరిత్ బౌలింగ్‌లో డాన్ జాన్సెన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..  

కేకేఆర్ తరుపున 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన దినేశ్ కార్తీక్, 2014 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 50 బంతుల్లో 94 పరుగులు చేసిన మనీశ్ పాండే, 2017లో గుజరాత్ లయన్స్‌పై 41 బంతుల్లో 93 పరుగులు చేసిన క్రిస్ లీన్.. 90+ స్కోరు దాటినా సెంచరీ మార్కు మాత్రం అందుకోలేకపోయారు. 

18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన రింకూ సింగ్, జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా ఆండ్రే రస్సెల్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ స్కోరుని 180+ దాటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios