వన్‌సైడ్ మ్యాచ్‌గా మారిన ఐపీఎల్ 2022 ఫైనల్... 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తు చేసి మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్...
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ని గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్, లీగ్ స్టేజీలోనే కాకుండా ప్లేఆఫ్స్‌లోనూ అదిరిపోయే ఆటతీరు చూపించి... ఫైనల్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. సొంత మైదానంలో లక్ష మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని 7 వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్ టైటాన్స్, ఆరంగ్రేట సీజన్‌లోనే టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది..
131 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం దక్కలేదు. వృద్ధిమాన్ సాహా 5 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో పరుగులేమీ రాలేదు.
10 బంతుల్లో 8 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ కూడా ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేయగలిగింది టైటాన్స్...
30 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా వికెట్‌తో ఈ సీజన్‌లో 27 వికెట్లు పూర్తి చేసుకున్న చాహాల్, పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు..
గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 22 పరుగులు కావాల్సిన దశలో 17వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు, శుబ్‌మన్ గిల్ 43 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించేశారు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి,యష్ దయాల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సాయి కిషోర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. 11 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సాయి కిషోర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ ఫైనల్‌లో ఓ కెప్టెన్ బౌలింగ్‌లో మరో కెప్టెన్ అవుట్ కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2009 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అవుట్ అయ్యాడు..
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తెగ ఇబ్బందిపడిన దేవ్‌దత్ పడిక్కల్ 10 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 35 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఐపీఎల్ 2022లో 863 పరుగులు చేసి, సీజన్‌ని ముగించాడు.
ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు జోస్ బట్లర్. ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేసి టాప్‌లో ఉండగా అదే సీజన్‌లో 848 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు బట్లర్... ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు...
నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ ప్రమాదకరంగా మారుతున్న జోస్ బట్లర్‌ని హార్ధిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. పాండ్యా బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బట్లర్. భారీ ఆశలు పెట్టుకున్న సిమ్రాన్ హెట్మయర్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, 2009లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. 2009లో ఆర్‌సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు...
9 బంతులాడిన రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో వరుస వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. సాయి కిషోర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ట్రెంట్ బౌల్ట్, 7 బంతుల్లో 11 పరుగులు చేసి రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
18వ ఓవర్‌లో 16 పరుగులు రాగా 19వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే రాబట్టగలిగారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు రియాన్ పరాగ్, ఓబెడ్ మెక్‌కాయ్. ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఓబెడ్ మెక్‌కాయ్ రనౌట్ కాగా చివరి బంతికి రియాన్ పరాగ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ..
