IPL 2022 Finals: ఐపీఎల్-15 లో పేస్ బౌలింగ్ తో సంచలనాలు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్  ఉమ్రాన్ మాలిక్ కు స్వంత ఊళ్లో  ఘన స్వాగతం లభించింది. 

ఐపీఎల్-2022 లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదిరిపోయే ప్రదర్శనలతో ఆకట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ స్వంత రాష్ట్రం జమ్మూకు చేరుకున్నాడు. ఐపీఎల్-15 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంతో అతడు ముందుగానే ఇంటికి చేరాడు. జమ్మూలోని గుజ్జర్ నగర్ ఉమ్రాన్ సొంతూరు. ఈ నేపథ్యంలో గుజ్జర్ నగర్ చేరుకున్న ఉమ్రాన్ కు ఘన స్వాగతం లభించింది. ఆకట్టుకునే ప్రదర్శనలతో టీమిండియాకు సెలెక్ట్ అయిన ఉమ్రాన్ ను స్థానికంగా ఉన్న మొహల్లా వెల్ఫేర్ కమిటీ ఘనంగా సత్కరించింది.

గుజ్జర్ నగర్ కు చేరుకున్న ఉమ్రాన్ ను నేరుగా కార్లోనే అతడిని సభాస్థలి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు ఉమ్రాన్ తో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అనంతరం గుజ్జర్ నగర్ ఎస్పీ, స్థానిక నాయకులు అతడిని అభినందించారు. 

ఉమ్రాన్ తో పాటు అతడి తండ్రి అబ్దుల్ రషీద్ కూడా ఉన్నారు. సభా వేదికమీద ఆయన కూడా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మాలిక్ తండ్రి రషీద్ మాట్లాడుతూ.. తన కొడుకుకు గుజ్జర్ నగర్ లోనే గాక జమ్మూకాశ్మీర్, భారత్ మొత్తం మద్దతునిస్తున్నదని తెలిపాడు. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ లో ఎంపికైన అతడు కచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా స్థానికులు ఉమ్రాన్ పై ప్రశంసలు కురిపించారు. మొహల్లా వెల్ఫేర్ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఉమ్రాన్ మాలిక్ గుజ్జర్ నగర్ కే కాదని.. ఇండియా మొత్తం గర్వించే నాయకుడిగా ఎదుగుతాడని అన్నారు. 

ఇక ఈ సీజన్ లో ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచులాడి 22 వికెట్లు పడగొట్టాడు. ప్రతి మ్యాచ్ లో అతడు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులు సంధించాడు. సన్ రైజర్స్ ఆడిన ప్రతి మ్యాచ్ లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఫాస్టెస్ట్ డెలివరీ అతడిదే. ఈ సీజన్ లో ఉమ్రాన్.. 157 కి.మీ. వేగంతో బంతులు విసిరి ఐపీఎల్ లో అత్యంత రెండో వేగవంతమైన బంతిని విసిరాడు. ఇక తర్వాత తాను షోయభ్ అక్తర్ రికార్డును అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్.. 25-5 తో రికార్డు సృష్టించాడు.