IPL 2022: మహారాష్ట్ర వేదికగా నెలన్నరగా సాగుతున్న ఐపీఎల్ ప్లేఆఫ్స్ దశకు చేరినా టీవీ రేటింగ్స్ మాత్రం రావడం లేదు. గతేడాదితో పోలిస్తే రేటింగ్స్ దారుణంగా పడిపోతుండటంతో అడ్వర్టైజర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారీ ఆశల నడుమ ప్రారంభమైన ఐపీఎల్-15 అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదా..? అసలు ఐపీఎల్ ను దేశంలో ఎవరూ చూడటం లేదా..? అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు. గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ టీవీ వ్యూయర్షిప్ ఈ ఏడాది దారుణంగా పడిపోతున్నది. 2021 తో పోలిస్తే ఇప్పుడు అది 30 శాతానికి పైగా తగ్గినట్టు.. టీవీ రేటింగ్ ల వివరాలు చెప్పే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) తాజా నివేదికలు చెబుతున్నాయి. వరుసగా 17వ వారం కూడా స్టార్ స్పోర్ట్స్ గానీ.. దాని అనుబంధ స్థానిక భాషల ఛానెల్స్ లో గానీ రేటింగ్స్ ఆశాజనకంగా లేవు.
ఈ ఏడాది ఐపీఎల్-15 వ్యూయర్షిప్ గతేడాదితో పోలిస్తే 35 శాతం తగ్గింది. టాప్-4 ఛానెళ్ల లిస్ట్ లో స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ లేదు. మా టీవీ రెండో స్థానంలో ఉన్నా అది సీరియల్స్, ఇతర షో ల ద్వారా వచ్చే వ్యూయర్షిప్ గానీ ప్రత్యేకించి క్రికెట్ చూసేవాళ్లే లేరు. తొలి నాలుగు వారాల ఐపీఎల్ టీవీ రేటింగ్స్.. 30 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం.
నష్ట పరిహారం ఇవ్వండి..
ఐపీఎల్ టీవీ రేటింగ్స్ అదిరిపోతుందని ఊరించిన స్టార్ స్పోర్ట్స్ (ఐపీఎల్ అధికారిక ప్రసారదారు) ఊదరగొట్టింది. అడ్వర్టైజర్ల దగ్గర్నుంచి సాధారణ ధర కంటే 15 శాతం ఎక్కువ వసూలు చేసింది. అయితే దాదాపు ముగిసేస్టేజ్ కు వస్తున్నా ఐపీఎల్ టీవీ రేటింగ్స్ మాత్రం పెరగడం లేవు. దీంతో అడ్వర్టైజర్లు స్టార్ స్పోర్ట్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమతో అదనంగా చెల్లించుకున్న డబ్బులకు సంబంధించి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే అని స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్ మెట్లెక్కుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ కూడా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
ఐపీఎల్ ను నమ్మి సెకండ్ల వ్యవధిలో వచ్చే యాడ్స్ కు కూడా వందల కోట్ల రూపాయలు చెల్లించిన తాము.. ఇప్పుడు మోసపోయామని, తమకు పరిహారం చెల్లించాల్సిందే అని సదరు సంస్థలు బీసీసీఐని కోరుతున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం రేటింగ్స్ పెరుగుతాయని, రాబోయే వారం లో కీలక మ్యాచ్ లు ఉండటం.. ప్లేఆఫ్స్, ఫైనల్స్ దగ్గరపడుతుండటంతో ఐపీఎల్ టీవీ వ్యూయర్షిప్ గణనీయంగా పెరుగుతుందని వాళ్లను బుజ్జగిస్తున్నది.
బీసీసీఐ ఆశలకు గండి..
ఈ ఏడాదితో ఐపీఎల్ స్పాన్సర్షిప్ స్టార్ స్పోర్ట్స్ గడువు తీరుతుంది. తర్వాత ఐదేండ్లకు (2023-2028) గాను బీసీసీఐ ఇటీవలే టెండర్లను ఆహ్వానించింది. గతంలో రూ. 16,347 కోట్లు ఉన్న బేస్ ప్రైస్ ను డబుల్ (రూ. 32,890 కోట్లు) చేసింది. ఈ మేరకు ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో అమెజాన్, రిలయన్స్, సోని వంటి పెద్ద సంస్థలు పోటీ లో నిలిచాయి. అయితే ఐపీఎల్ తాజా రేటింగుల నేపథ్యంలో ఆ సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రమారమి రూ. 50 వేల కోట్లు అయినా ఆర్జించాలని బీసీసీఐ టార్గెట్ గా పెట్టుకుంది. కానీ తాజా రేటింగ్స్ ను చూసి వాటికి అంత ధర వెచ్చించడం అవసరమా..? అనే యోచనలో పై సంస్థలున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే బీసీసీఐ ఆశలకు గండి పడ్డట్టే..
ఇదే విషయమై సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా డైరెక్టర్, సీఈవో ఎన్పి సింగ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ మీడియా హక్కుల బేస్ ప్రైస్ ను అంత ఎక్కువ చేయడమనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బీసీసీఐ.. ఆ ధరను డబుల్ చేసింది. కానీ వాస్తవానికి రేటింగ్స్ మాత్రం ఆ స్థాయిలో లేవన్నది గణాంకాలు చెబుతున్న వాస్తవం. రేటింగ్స్ తగ్గుతుంటే మీడియా హక్కులకు అంత చెల్లించాలా..?’ అని అనుమానం వ్యక్తం చేశారు.
