RCB vs SRH Live Updates: ఈ సీజన్ లో వరుసగా ఏడో సారి గెలిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ మామ. వరుసగా నాలుగు మ్యాచులు గెలిచిన హైదరాబాద్.. అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది
ఐపీఎల్-2022 సీజన్లో శనివారం మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ లు నేడు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో తలపడబోతున్నాయి. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న ఈ జట్లు తమ జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తున్నాయి. సీజన్లో తొలి రెండు మ్యాచులు ఓడిన సన్ రైజర్స్.. తర్వాత పుంజకుని ఏకంగా నాలుగు విజయాలతో జోష్ లో ఉంది. ఇక ఈ సీజన్ లో ఆడిన ఏడు మ్యాచుల్లో 5 విజయాలతో బెంగళూరు కూడా పటిష్టంగా ఉంది. ఆసక్తికరంగా మారిన నేటి మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో కేన్ మామ టాస్ గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
వరుసగా నాలుగు విజయాలతో దూకుడుమీదున్న కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్ రైజర్స్.. దానిని కొనసాగించాలని భావిస్తున్నది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంపై గురి పెట్టిన కేన్ మామ సేన.. నెట్ రన్ రేట్ (-0.077) ను కూడా మెరుగుపరుచుకోవాలని చూస్తున్నది. ఇరు జట్లు మార్పులేమీ లేకుండానే గత మ్యాచులో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి.
ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచులలో విజయాలు సాధించి జోరుమీదున్నాయి. సన్ రైజర్స్.. పంజాబ్ ను 7 వికెట్లతో చిత్తు చేయగా బెంగళూరు లక్నోను 18 పరుగుల తేడాతో ఓడించింది.
బలాబలాలు :
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే కేన్ మామ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. మిడిలార్డర్ మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నా విలియమ్సన్ రాణించడం జట్టుకు ఆవశ్యకం. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, భువనేశ్వర్ లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. భీకర పేస్ తో నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మాలిక్.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లిని ఔట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.
ఇక ఆర్సీబీ కూడా బ్యాటింగ్, బౌలింగ్ లలో పటిష్టంగా ఉంది. అయితే బ్యాటింగ్ లో విరాట్ కోహ్లి ఫామ్ ఆ జట్టును వేధిస్తున్నది. ఈ సీజన్ లో ఆడిన 7 ఇన్నింగ్స్ లలో కోహ్లి చేసిన పరుగులు 119 మాత్రమే. ఒక్క హాఫ్ సెంచరీ లేదు. లక్నో తో ముగిసిన మ్యాచ్ లో కోహ్లి డకౌట్ అయ్యాడు. అతడితో పాటు అనూజ్ రావత్ కూడా రాణించాల్సి ఉంది. లక్నోతో మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్.. 96 పరుగులతో చెలరేగి తిరిగి ఫామ్ లోకి రావడం ఆర్సీబీకి లాభించేదే. ఇక షాబాజ్అహ్మద్, దినేశ్ కార్తీక్ లు కూడా జోరుమీదున్నారు. వీళ్ల మీదే ఆర్సీబీ ఫినిషింగ్ ఆశలున్నాయి.
బౌలింగ్ లో జోష్ హెజిల్వుడ్, మహ్మద్ సిరాజ్ లు పేసర్లుగా రాణిస్తుండగా.. హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో కీలకంగా మారుతున్నాడు. స్పిన్నర్ వనిందు హసరంగ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు.
ముఖాముఖి : ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో 11 సార్లు హైదరాబాద్ నే విజయం వరించగా.. 8 మ్యాచుల్లో బెంగళూరు గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్‌రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ, హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జగదీష సుచిత్, భువనేశ్వర్ కుమార్, జాన్సేన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
