IPL 2022 RR vs GT Final:  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్... 

ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది.టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో తొలుత బ్యాటింగ్ చేసి, ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్‌లో మళ్లీ అదే నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... 

రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్‌కి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్‌ రాయల్స్‌ని ఓడించింది గుజరాత్... ఇరుజట్ల మధ్య లీగ్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్. టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి వచ్చిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ విధించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది...

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యష్ ధయాల్, మహ్మద్ షమీ, లూకీ ఫర్గూసన్

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఓబెడ్ మెక్‌కాయ్, యజ్వేంద్ర చాహాల్

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, ఛాంపియన్ జట్లకు చుక్కలు చూపిస్తూ ఫైనల్‌కి దూసుకొచ్చింది...
టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి వచ్చిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం అందుకుని... ఫైనల్‌కి ఎంట్రీ ఇచ్చింది...
ఈ సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ టైటిల్ గెలిస్తే అతి తక్కువ మ్యాచుల్లో జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలుస్తాడు... ఓ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా బరిలో దిగలేదు. 

2013 సీజన్‌ మధ్యలో రికీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ, 11 మ్యాచుల్లోనే టైటిల్ అందించాడు... 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచిన షేన్ వార్న్ 16 మ్యాచుల్లో టైటిల్ గెలిచి, రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు... హార్ధిక్ పాండ్యా 15 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధిస్తే, రోహిత్ తర్వాతి ప్లేస్‌కి ఎగబాకుతాడు...

రాజస్థాన్ రాయల్స్‌ని 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేర్చిన సంజూ శాంసన్, ఈసారి టైటిల్ సాధిస్తే అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన రెండో కెప్టెన్‌గా నిలుస్తాడు...
2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో రోహిత్ శర్మ వయసు 26 ఏళ్లు కాగా సంజూ శాంసన్ ప్రస్తుత వయసు 27 ఏళ్ల 198 రోజులు..