Asianet News TeluguAsianet News Telugu

ఎలిమినేటర్ మ్యాచ్: 12 గంటలకు వాన ఆగినా సరే... ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ కొత్త నిబంధనలతో...

వర్షం కారణంగా రెండు గంటలు పోయినా, పూర్తి ఓవర్ల పాటు సాగనున్న ఆట... ఒంటిగంట తర్వాత కూడా రిజల్ట్ రాబట్టేందుకు అవకాశం... 

IPL 2022 RCB vs LSG: Rules for rain interrupted IPL Playoffs game
Author
India, First Published May 25, 2022, 7:38 PM IST

ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. తేలికపాటి జల్లులు కురుస్తుండడంతో టాస్‌ని ఆలస్యం చేశారు అంపైర్లు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే జల్లులు కాస్తా పెరిగి పెరిగి భారీ వర్షంగా మారింది...

తుంపరలు పడుతున్నాయని కేవలం పిచ్‌ని మాత్రం కవర్ చేసిన సిబ్బంది, భారీ వర్షంగా మారడంలో స్టేడియంలోని గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పాల్సి వచ్చింది... 

లీగ్ స్టేజీలో లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచులు గెలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో నేటి మ్యాచ్ రద్దయితే లీగ్ స్టేజీలో ఎక్కువ విజయాలు అందుకున్న కారణంగా లక్నో సూపర్ జెయింట్స్, రెండో క్వాలిఫైయర్‌కి అర్హత సాధిస్తుంది...

అయితే అంత తేలిగ్గా లక్నోకి లైన్ క్లియర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కోల్‌కత్తాలో వర్షాలను ముందుగానే అంచనా వేసిన బీసీసీఐ, ప్లేఆఫ్స్ మ్యాచులకు వాన అంతరాయం కలిగించినా రిజల్ట్ రాబట్టేందుకు కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది...

వీటి ప్రకారం మ్యాచ్ ఆరంభ సమయానికి రెండు గంటల తర్వాత కూడా ఆట ప్రారంభమైతే పూర్తి ఓవర్ల పాటు కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే రాత్రి 9 గంటల 40 నిమిషాలకు ఆట ప్రారంభమైనా ఇరు జట్లూ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేయాల్సిందే...

ఆ తర్వాత ఆట ఆలస్యమయ్యేకొద్దీ ఓవర్లను తగ్గిస్తూ వస్తారు. ఒకవేళ రాత్రి 11 గంటల 56 నిమిషాలకు ఆట ప్రారంభమైనా చెరో 5 ఓవర్ల పాటు మ్యాచ్ సాగుతుంది. అంటే 40 ఓవర్ల టీ20 మ్యాచ్ కాస్తా, ఎఫ్‌5గా మారుతుందన్న మాట. ఐదేసి ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేయగలిగితే వారిదే విజయం...

ఒకవేళ ఆ సమయానికి కూడా వర్షం తగ్గకపోతే రాత్రి 12 గంటల 50 వరకూ వేచి చూస్తారు. 12:50కి ఆట ప్రారంభించగలిగితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. చెరో ఓవర్ బ్యాటింగ్ చేసి, గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2కి అర్హత సాధిస్తుంది... 

ఒకవేళ వర్షం ఆగకుండా నిరంతరంగా కుండపోతగా కురుస్తుంటే మాత్రం ఆట కొనసాగించే అవకాశం ఉండకపోవడంతో కెఎల్ రాహుల్ టీమ్, లీగ్ స్టేజ్ పర్ఫామెన్స్ కారణంగా రాజస్థాన్ రాయల్స్‌తో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడేందుకు అహ్మదాబాద్ చేరుకుంటుంది... 

గత రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ, రెండుసార్లు కూడా నాలుగో స్థానంలోనే ముగించింది..  

ఇరు జట్ల మధ్య గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయినా ఫాఫ్ డుప్లిసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేయగా మ్యాక్స్‌వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26, దినేశ్ కార్తీక్ 13 పరుగులు చేసి రాణించారు...

లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగుల మాత్రమే చేయగలిగింది. కెఎల్ రాహుల్ 30 పరుగులు చేయగా కృనాల్ పాండ్యా 42, మార్కస్ స్టోయినిస్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జోష్ హజల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు...

Follow Us:
Download App:
  • android
  • ios