Asianet News TeluguAsianet News Telugu

ఆ సమయంలో ఎవరూ ఆ పని చేయలేదు.. నమ్మించి మోసం చేశారు : ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ షాకింగ్ కామెంట్స్

TATA IPL 2022 RCB vs RR: గతేడాది ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకుని పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్.. ఈ ఏడాది వేలంలో  భారీ ధర దక్కించుకున్నాడు. అయితే 2018 నుంచి 2020 వరకు అతడికి ఐపీఎల్ ఒక పీడకలలా మిగిలింది. 

IPL 2022: RCB's Bowler Harshal Patel reveals How He Was cheated By Franchises in 2018
Author
India, First Published Apr 26, 2022, 8:03 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్, వేలంలో పది కోట్ల రూపాయలతో అందరి  దృష్టి ఆకర్షించిన హర్షల్ పటేల్ తాను గతంలో మోసపోయానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2015 సీజన్ లో 17 వికెట్లు పడగొట్టిన తర్వాత తనకోసం నాలుగైదు జట్లు పోటీ పడతాయని చెప్పారని కానీ తాను నమ్మినవాళ్లే తనను మోసం చేశారని వ్యాఖ్యానించాడు. అంతేగాక వేలంలో తనకు భారీ  ధర దక్కడం.. జట్టులో విరాట్ కోహ్లి, ఇతర ఆటగాళ్ల సహకారం వంటి విషయాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.  ప్రముఖ యూట్యూబ్ షో బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ లో  హర్షల్  తన కెరీర్ కు సంబంధించిన కీలక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు.

హర్షల్ మాట్లాడుతూ.. ‘2018 వేలం జరుగుతున్నప్పుడు నా కోసం ఎవరో ఒకరు బోర్డు ఎత్తుతారని ఆశగా ఎదురుచూశాను.  వాస్తవానికి ఆ సమయంలో నేను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు.  ఏదైనా జట్టుకోసం ఆడే అవకాశం వచ్చినా చాలనుకున్నా..

అయితే అంతకుముందే పలు ఫ్రాంచైజీలకు చెందిన నలుగురైదురు ఆటగాళ్లు నన్ను తాము ఆడుతున్న జట్టు కోసం కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు. కానీ తీరా వేలంలో ఎవరూ ఆ పనిచేయలేదు. అది నా కెరీర్ లో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అప్పుడు నాకు నిజంగా నేను మోసపోయినట్లు.. నమ్మకద్రోహానికి గురైనట్టు భావించాను. ఆ భావన కొన్నాళ్ల పాటు నన్ను వేధించింది.. చాలా రోజుల పాటు నేను దాని గురించే ఆలోచించాను. కానీ తర్వాత ఆటమీద దృష్టి పెట్టి ముందుకు సాగాను..’ అని చెప్పుకొచ్చాడు. 

2018 నుంచి 2020 వరకు హర్షల్.. ఢిల్లీ  క్యాపిటల్స్ తరఫున  ఆడాడు.   ఆ జట్టు పెద్దగా అవకాశాలివ్వలేదు. కానీ 2021లో తిరిగి ఆర్సబీకి వచ్చి  సంచలనాలు నమోదు చేశాడు. ఆ సీజన్ లో ఏకంగా 32 వికెట్లు నేలకూల్చి  ఆర్సీబీ ప్లేఆఫ్ వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 

కోహ్లి మెసేజ్ చేశాడు.. 

ఇంకా హర్షల్ మాట్లాడుతూ తనకు 2022 వేలంలో రూ. 10.75 కోట్ల ధర పలకగానే  లాటరీ తగిలిందని  కోహ్లి మెసేజ్ చేశాడని గుర్తు చేసుకున్నాడు. ‘అప్పుడు (వేలం రోజు) నేను  ఒక రూమ్ లో కూర్చుని వేలం ప్రక్రియను చూస్తున్నాను. 2018లో ఏదైతే జరిగిందో ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. వేలం పాడే వ్యక్తి నా పేరు పలకగానే  ఈసారి నేను ఊహించని విధంగా ధర దక్కింది. రూ. 6 కోట్ల దగ్గర ఉన్నప్పుడు నా భార్య ఆ అమౌంట్ డబుల్ అవుతుందని నాతో చెప్పింది. అప్పుడు నేను.. ఒకవేళ అలా అయితే రూ. 7 కోట్లు నావేనని, మిగిలిన మొత్తం నీకే ఇచ్చేస్తానని చెప్పా.. 

 

ఇక నాకు వేలంలో రూ. 10.75 కోట్లు దక్కగానే విరాట్ కోహ్లి నాకు మెసేజ్ చేశాడు. నీకు లాటరీ తగిలింది భాయ్ అని చెప్పాడు. నేను కూడా అవును భయ్యా.. లాటరీ గెలిచినట్టే ఉంది. ఇది నేను ఊహించలేదు.. అని చెప్పా..  దానికి కోహ్లి నువ్వు దీనికి అర్హుడివే అని రిప్లై ఇచ్చాడు..’ అని తెలిపాడు. 

మ్యాక్సీ అలా చెప్తాడు.. 

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ,గ్లెన్ మ్యాక్స్వెల్ లు తన బౌలింగ్ ను భాగా ఇష్టపడతారని  హర్షల్ చెప్పాడు. ముఖ్యంగా మ్యాక్సీ అయితే తాను స్లో బంతులు వేస్తే కొట్టడం కష్టమని అంటాడని తెలిపాడు. తన బౌలింగ్ తో పాటు వ్యక్తిగతంగా ఎదగడానికి  కోహ్లి, డివిలియర్స్ ల మాటలు ఎంతో శక్తినిచ్చాయని పటేల్ వివరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios