TATA IPL 2022 RCB vs RR: అదే ఆట.. గత  మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఎదురైన భంగపాటును ఆర్సీబీ ఇంకా మరిచిపోయినట్టు లేదు.  బౌలర్లు కష్టపడి ప్రత్యర్థి జట్టును నిలువరించిన చోట బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమై ఈ సీజన్ లో నాలుగో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  

బౌలర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన చోట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదా..? అన్న రీతిలో బెంగళూరు బ్యాటర్ల ప్రదర్శన సాగింది. తక్కువ స్కోరను రక్షించుకునే క్రమంలో రాజస్తాన్ బౌలర్లు అత్యద్భుత స్థాయిలో బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బంతులతో ఆర్సీబీ బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకోవడమే గాక అవసరమైన సందర్భంలో వికెట్లు తీసి తమ జట్టును గెలిపించారు. రాజస్తాన్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 29 పరుగుల తేడాతో రాజస్తాన్ గెలిచింది.

తాజా విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ను వెనక్కినెట్టి అగ్ర స్థానానికి చేరుకుంది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది నాలుగో (మొత్తం 9 మ్యాచులు) పరాజయం కాగా రాజస్తాన్ కు ఆరో (మొత్తం 8 మ్యాచులలో 2 ఓటములు) విజయం. ఇక ఆర్సీబీతో జరిగిన గడిచిన ఆరు మ్యాచులలో రాజస్తాన్ కు ఇదే తొలి విజయం. ఈ సీజన్ లో కూడా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం ఆర్సీబీనే వరించింది. 

కాగా స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ కి ఆదిలోనే షాకిచ్చారు రాజస్తాన్ బౌలర్లు. సీజన్ లో దారుణంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లి (9) ఈ మ్యాచ్ లో కూడా అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన అతడు.. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. కానీ ప్రసిధ్ కృష్ణ వేసిన 2వ ఓవర్ నాలుగో బంతికి రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

కోహ్లి నిష్క్రమణ తర్వాత ఆర్సీబీ నాలుగు ఓవర్ల దాకా పరుగులు రాబట్టడమే కష్టంగా మారింది. అడపాదడపా బంతిని బౌండరీ దాటించిన డుప్లెసిస్ (21 బంతుల్లో 23.. 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ఏడో ఓవర్ వేసిన కుల్దీప్ సేన్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే గ్లెన్ మ్యాక్స్వెల్ డకౌటయ్యాడు. ఫలితంగా 7 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 38-3. 

కొత్త కుర్రాడు రజత్ పాటిదార్ (16) షాబాజ్ అహ్మద్ (27 బంతుల్లో 17) ఆదుకుంటారని ఆర్సీబీ నమ్మకం పెట్టుకుంది. కానీ రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాకే గగనమైంది. పదో ఓవర్ వేసిన అశ్విన్.. పాటిదార్ ను బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆర్సీబీ వికెట్ల పతనం మరింత వేగంగా సాగింది. 

Scroll to load tweet…

అశ్విన్ తన తర్వాతి ఓవర్లో ప్రభుదేశాయ్ (2) ను కూడా ఔట్ చేశాడు. అతడి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (6) రనౌట్ అయి నిరాశపరిచాడు. వరుసగా వచ్చినోళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరుతుండటంతో షాబాజ్ కూడా వాళ్లే అనుసరించాడు. అశ్విన్ వేసిన 16వ ఓవర్లో పరాగ్ కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్లో కుల్దీప్ సేన్.. హసరంగ (18) ను కూడా ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత హర్షల్ పటేల్ (8), సిరాజ్ (5) కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. 

తక్కువ స్కోరును రక్షించుకునే క్రమంలో రాజస్తాన్ బౌలర్లు రాణించారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4-0-17-3) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్ లు నాలుగు వికెట్లు తీశాడు. ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. చాహల్ కు వికెట్ దక్కకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కూడా ఆర్సీబీ బౌలర్లకు తలవంచింది. ఆ జట్టు టాప్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. జోస్ బట్లర్ (8), దేవదత్ పడిక్కల్ (7), శాంసన్ (27), డారిల్ మిచెల్ (16), హెట్మెయర్ (3) లు విఫలమైన చోట కుర్రాడు రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెంటర్లతో కలిసి రాజస్తాన్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బ్యాటర్ గానే గాక ఫీల్డింగ్ లో కూడా రియాన్ పరాగ్ అదరగొట్టాడు. విరాట్ కోహ్లి, షాబాజ్ అహ్మద్, ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్ క్యాచులను పట్టింది అతడే కావడం విశేషం. 

సంక్షిప్త స్కోర్లు : 
- రాజస్తాన్ రాయల్స్ : 20 ఓవర్లలో 144-8 
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 19.3 ఓవర్లలో 115 ఆలౌట్ 
ఫలితం : 29 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం