Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: ఓటమితో ముగించిన సన్‌రైజర్స్... వరుసగా నాలుగోసారి ఆరేసిన పంజాబ్ కింగ్స్...

లియామ్ లివింగ్‌స్టోన్ మెరుపులు... 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్... వరుసగా నాలుగో సీజన్‌లోనూ ఆరో స్థానంలో నిలిచిన పంజాబ్... 

IPL 2022: Punjab Kings beats SunRisers Hyderabad finishes in 6th place
Author
India, First Published May 22, 2022, 11:02 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌‌ని పరాజయంతో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ, ఓటమితోనే సీజన్‌ని ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ 2022 సీజన్‌ని 8వ స్థానంలో ముగించింది. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ విధించిన లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో ఛేదించిన పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో సీజన్‌లోనూ ఆరో స్థానంలో నిలిచింది...

2019 నుంచి వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంలోనే నిలిచింది పంజాబ్ కింగ్స్. ఈ నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లు మారినా టీమ్ పొజిషన్ మారకపోవడం విశేషం.

15 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, ఫజల్‌హక్ ఫరూకీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన షారుక్ ఖాన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

4 బంతుల్లో 1 పరుగు చేసిన మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ కాగా శిఖర్ ధావన్ 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి ఫజల్‌హక్ ఫరూకీ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు...

ఐపీఎల్‌లో 700+ ఫోర్లు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. వస్తూనే 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన జితేశ్ శర్మ, జగదీశ సుచిత్ బౌలింగ్‌లో ప్రియమ్ గార్గ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లివింగ్‌స్టోన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన జితేశ్, ఆ తర్వాతి బంతికి అవుట్ అవ్వడం విశేషం...

అయితే జితేశ్ అవుట్ అయ్యే సమయానికే పంజాబ్ కింగ్స్ విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే కావాలి. రొమారియో వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు రాబట్టాడు లియామ్ లివింగ్‌స్టోన్. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు లియామ్ లివింగ్‌స్టోన్. ప్రేర్ మన్కడ్ బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ ప్రియమ్ గార్గ్ 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి కగిసో రబాడా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆరెంజ్ ఆర్మీ. ఈ దశలో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి కలిసి రెండో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కూడా హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లోనే లియామ్ లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఇద్దరూ ఈ సీజన్‌లో 400+ పరుగులు పూర్తి చేసుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా నిలవడం విశేషం...

నికోలస్ పూరన్ 10 బంతుల్లో 5 పరుగులు చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 17 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ని స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు హర్‌ప్రీత్ బ్రార్...

దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి 96 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్... అయితే రొమారియో సిఫర్డ్, వాషింగ్టన్ సుందర్ కలిసి వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...

29 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని నాథన్ ఎల్లీస్ విడదీశాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే జగదీశ సుచిత్‌ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

ఇన్నింగ్స్ ఆఖరి బంతి నో బాల్‌గా వచ్చినా అనవసర పరుగుకి ప్రయత్నించిన భువనేశ్వర్ కుమార్ రనౌట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన రొమారియో సిఫర్ట్ నాటౌట్‌గా నిలిచాడు.. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లీస్ 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios