ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటైన్షన్ రూల్స్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ... కొత్తగా వచ్చే జట్లకి కూడా రిటైన్షన్ పాలసీ వల్ల నష్టం కలగకుండా బీసీసీఐ ఆలోచన.. వేలానికి ముందే ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు...
ఐపీఎల్ 2021 సీజన్‌కి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగే ఫైనల్‌తో ఈ సుదీర్ఘ సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. దీంతో అందరి దృష్టి ఐపీఎల్ 2022 సీజన్‌పైకి మళ్లింది. వచ్చే సీజన్‌లో అదనంగా రెండు కొత్త జట్లు వస్తుండడంతో మెగా వేలం జరగనుంది.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటైన్షన్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? 8 ఫ్రాంఛైజీలు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకోబోతున్నాయి? ఏ ప్లేయర్లను వేలానికి వదిలేయడానికి సిద్ధమవుతాయి? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది...
అయితే ఇప్పటికే ఉన్న జట్లకి రిటెన్షన్ పాలసీ ద్వారా దాదాపు ఐదు లేదా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండడం, కొత్తగా వచ్చే జట్లతో పోలిస్తే వారికి అదనపు బెనిఫిట్‌గా మారనుంది. అయితే కొత్త జట్లకి ఈ విషయంలో అన్యాయం జరగకుండా ఓ సరికొత్త పాలసీ తీసుకొచ్చేందుకు ఐపీఎల్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు సమాచారం..
కొత్తగా వచ్చే రెండు జట్లూ, మెగా వేలానికి ముందే కొందరు ఆటగాళ్లను తీసుకునే అవకాశం కలిగించనుంది. ఉదాహరణకి చెన్నై సూపర్ కింగ్స్ జట్లు జడేజా, ధోనీ, దీపక్ చాహార్‌లను రిటైన్ చేసుకుని మిగిలిన వారిని మెగా వేలానికి విడుదల చేసింది అనుకుందాం. మిగిలినవారిలో సురేష్ రైనా, శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లతో సంప్రదింపులు జరిపి, మెగా వేలం ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంఛైజీలు సొంతం చేసుకునే వీలు ఉంటుంది...
అయితే ఇది కొన్ని ఫ్రాంఛైజీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రిటెన్షన్ పాలసీలో పరిమితులు ఉండడంతో కొందరు ప్లేయర్లను వేలానికి వదిలేసి, వేలంలో ఎంత చెల్లించైనా కొనుగోలు చేయాలని ఫ్రాంఛైజీలు భావించవచ్చు. వేలానికి ముందే కొత్త జట్లు ఆ ప్లేయర్లను కొనుగోలు చేస్తే... ఆ అవకాశం కోల్పోతాయి ఇప్పటికే ఉన్న ఫ్రాంఛైజీలు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వచ్చేకొత్త జట్ల ద్వారా దాదాపు రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల దాకా ఆదాయాన్ని ఆర్జించాలని ఆలోచనలు చేస్తోంది బీసీసీఐ. ఇప్పటికే కొత్త జట్ల కోసం ఇచ్చిన టెండర్లకు ఆశించిన దాని కంటే భారీగా స్పందన వచ్చిందని తెలిపింది భారత క్రికెట్ బోర్డు...
