TATA IPL 2022 RR vs DC: గతేడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందిగా.. న్యూజిలాండ్ కు ట్రోఫీ ఆశలపై నీళ్లు పోస్తూ డేవిడ్ వార్నర్-మిచెల్ మార్ష్ లు చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ అందించారు. ఇప్పుడు అదే ఆట రాజస్తాన్ రాయల్స్ కు చూపించి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలను  సజీవంగా బతికించారు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు బౌలింగ్ లో రాణించి ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. మరో 9 బంతులు మిగిలుండగానే చేరుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్-డేవిడ్ వార్నర్ లు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్-2021 ను గుర్తు చేస్తూ స్ఫూర్తివంతమైన ఇన్నింగ్స్ ఆడారు. మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89.. 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ముందు బంతితో రాణించి తర్వాత బ్యాట్ తో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. 

రాజస్తాన్ నిర్దేశించిన ఈజీ టార్గెట్ ను ఢిల్లీ ఏమంత గొప్పగా ప్రారంభించలేదు. ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (0) డకౌట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ లో అతడు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చాడు. రాజస్తాన్ కు అదొక్కటి తప్ప తర్వాత సంతోషించడానికి ఏమీ మిగలలేదు. 

మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52 నాటౌట్.. 5 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసిన మిచెల్ మార్ష్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఎలాగైనా నిలవాలని ముందు సంయమనంతో ఆడిన అతడు.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మార్ష్ తో పోలిస్తే వార్నర్ కాస్త నెమ్మదిగానే ఆడినా అతడికి మంచి సహకారం అందించాడు. 

నాలుగు ఓవర్లకు 16.. కానీ.. 

ఈజీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రాజస్తాన్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభమైంది. తొల ఓవర్ బౌల్ట్ మేడిన్ వేయగా.. రెండో ఓవర్లో ప్రసిధ్ కూడా ఒక్క పరుగు ఇవ్వలేదు. బౌల్ట్ 3 వ ఓవర్లో 4 పరుగులు రాగా.. అశ్విన్ వేసిన 4వ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ.. 1 వికెట్ నస్టానికి 28 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్కోరు వేగం పెరిగింది. 

వార్నర్ తో జతకలిసిన మార్ష్.. కుల్దీప్ సేన్ వేసిన ఏడో ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 9వ ఓవర్లో వార్నర్ కూడా చాహల్ బౌలింగ్ లో ఓ సిక్సర్ కొట్టాడు. పది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 74-1 గా ఉంది. ఇక ఆ తర్వాత మార్ష్ రెచ్చిపోయాడు. చాహల్ వేసిన 11వ ఓవర్లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఐపీఎల్ లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ప్రసిద్ వేసిన 13వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాది స్కోరు వేగాన్ని పెంచాడు మార్ష్. మరోవైపు అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన వార్నర్ కూడా.. ఆ తర్వాత జోరు పెంచాడు. అశ్విన్ వేసిన 16వ ఓవర్లో సిక్సర్ కొట్టాడు. 

ఇక బౌల్ట్ వేసిన 17వ ఓవర్లో మార్ష్ 4,6 కొట్టి సెంచరీకి దగ్గరయ్యాడు. కానీ చాహల్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడి కుల్దీప్ సేన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 143 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మార్ష్ తృటి లో సెంచరీ కోల్పోయాడు. ఇక మార్ష్ నిష్క్రమించిన తర్వాత.. రిషభ్ పంత్ (4 బంతుల్లో 13 నాటౌట్.. 2 సిక్సర్లు) తో కిలిసి వార్నర్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. 18.1 ఓవర్ల లోనే ఢిల్లీ లక్ష్యాన్ని చేరుకుంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. అశ్విన్ (50) టాప్ స్కోరర్. కాగా.. మిచెల్ మార్ష్ బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 2 వికెట్లు కూడా తీయడం గమనార్హం.