Asianet News TeluguAsianet News Telugu

పోతూపోతూ చెన్నైని కూడా ఇంటికి పంపిన ముంబై ఇండియన్స్... డిఫెండింగ్ ఛాంపియన్‌కి...

98 పరుగుల టార్గెట్‌ కొట్టేందుకు 15 ఓవర్లు తీసుకున్న ముంబై ఇండియన్స్... 5 వికెట్ల తేడాతో సీజన్‌లో మూడో విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్...

IPL 2022 MI vs CSK: Mumbai Indians beats Chennai Super Kings, CSK out of Play-offs
Author
India, First Published May 12, 2022, 10:45 PM IST

ముంబై ఇండియన్స్ చెప్పినట్టే చేయాల్సినంత డ్యామేజీ అంతా చేసేసింది. ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ పోతూపోతూ, ఫోర్ టైమ్ టైటిల్ విన్నర్, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ని కూడా వెంట తీసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ చేతుల్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడి, సీజన్‌లో 8వ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్...  

98 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలోనూ ముంబై ఇండియన్స్ టాపార్డర్‌ నిర్లక్ష్యపు షాట్ సెలక్షన్‌తో మూల్యం చెల్లించుకుంది. 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ముఖేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్‌‌లో అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్  ఇచ్చి పెవిలియన్ చేరాడు...

వన్‌డౌన్‌లో వచ్చిన డానియల్ సామ్స్ 6 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న త్రిస్టన్ స్టబ్స్ కూడా డకౌట్ కావడంతో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్...

ముఖేశ్ చౌదరి 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా సిమర్‌జీత్ సింగ్ 22 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. ఈ ఇద్దరి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా 8 ఓవర్లు ముగిసే సరికి 46 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై... 

ఆ తర్వాత తిలక్ వర్మ, హృతిక్ షోకీన్ కలిసి ఐదో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హృతిక్ షోకీన్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటంగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్‌, ఆటగాళ్ల తప్పిదాల కారణంగా 16 ఓవర్లలో 97 పరుగులకి ఆలౌట్ అయ్యింది. స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు... ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. 

డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్... అయితే డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు... టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది. 

దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొయిన్ ఆలీ. మొదటి ఓవర్‌లో వైడ్ల రూపంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 3 పరుగులు రాగా, 2 వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లో రాబిన్ ఊతప్ప కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..అప్పటికీ డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఊతప్ప 1 పరుగు చేసి నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 3 ఓవర్లు ముగిసే సమయానికి 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది... 

6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, డానియల్ సామ్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన అంబటి రాయుడు, రిలే మెడరిత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో పవర్ ప్లే ముగిసేలోపు 5 వికెట్లు కోల్పోయింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్...  

చెన్నై సూపర్ కింగ్స్, పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోవడం ఇది మూడోసారి కాగా ఇంతకుముందు కూడా 2020, 2021 సీజన్లలో ముంబై ఇండియన్స్‌పై ఈ దారుణ రికార్డు నెలకొల్పింది సీఎస్‌కే...  9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన శివమ్ దూబే, రిలే మెడరిత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్.

ఈ దశలో ఎమ్మెస్ ధోనీతో కలిసి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు డీజే బ్రావో. 15 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన డీజే బ్రావో, కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

3 బంతుల్లో 2 పరుగులు చేసిన సిమర్‌జీత్ సింగ్ కూడా కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సిమర్‌జీత్ సింగ్ అవుటయ్యే సమయానికి డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకునే అవకాశాన్ని కల్పించారు అంపైర్లు. సిమర్‌జీత్ డీఆర్‌ఎస్ తీసుకున్నా, ఫలితం లేకపోయింది...

మహీశ్ తీక్షణ, రమన్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా ముకేశ్ చౌదరి 4 బంతుల్లో 4 పరుగులు చేసి 16వ ఓవర్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఎమ్మెస్ ధోనీ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios