211 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన లక్నో సూపర్ జెయింట్స్... ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి తొలి రెండు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌కి సూపర్ విక్టరీ దక్కింది. కొండంత లక్ష్యాన్ని ఛేదిస్తున్నాడమనే కంగారు లేకుండా భాగస్వామ్యాలు నిర్మిస్తూ సాగిన లక్నో... ఆఖరి ఓవర్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి ఇది తొలి విజయం కాగా... చెన్నై సూపర్ కింగ్స్, మొదటి రెండు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి...
211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు లక్నో సూపర్ జెయింట్స్‌కి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 99 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన కెఎల్ రాహుల్... ప్రెటోరియస్ బౌలింగ్‌లో రాయుడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్ పాండే 6 బంతుల్లో 5 పరుగులు చేసి మరోసారి నిరాశపరచగా క్వింటన్ డి కాక్ 45 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసి ప్రెటోరియస్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఐపీఎల్‌లో బ్రావోకి ఇది 171వ వికెట్. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లసిత్ మలింగ (170 వికెట్లు) రికార్డును అధిగమించిన బ్రావో, టాప్‌లోకి దూసుకెళ్లాడు. ఆఖరి 2 ఓవర్లలో లక్నో విజయానికి 34 పరుగులు కావాల్సి వచ్చాయి.
శివమ్ దూబే వేసిన ఆ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో పాటు వైడ్లతో కలుపుకుని మొత్తంగా 25 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 9 పరుగులే కావాల్సి వచ్చింది.
ఆఖరి ఓవర్ వేసిన ముఖేశ్ చౌదరి మొదటి రెండు బంతులను వైడ్లుగా వేశాడు. ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదిన ఆయుష్ బదోనీ, మ్యాచ్‌ను ముగించాడు. ఇవిన్ లూయిజ్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేయగా ఆయుష్ బదోనీ 9 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది...
రాబిన్ ఊతప్ప దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో 2.2 ఓవర్లలోనే 28 పరుగులు చేసింది సీఎస్‌కే. ఇందులో 4 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసిన యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఈసారి మొదటి రెండు మ్యాచుల్లో కలిసి 1 పరుగు మాత్రమే చేయగలగడం విశేషం.
ఊతప్ప అవుటైనా రాబిన్ ఊతప్ప దూకుడు కొనసాగించాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప... మెరుపు హాఫ్ సెంచరీతో పవర్ ప్లేలో ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది సీఎస్‌కే...
ఓవరాల్‌గా పవర్ ప్లేలో సీఎస్‌కేకి ఇది నాలుగో అత్యధిక స్కోరు. పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన నాలుగో క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ఇంతకుముందు సురేష్ రైనా 87, డ్వేన్ స్మిత్ 50 పరుగులు చేయగా, కేకేఆర్‌పై రైనా 47 పరుగులు చేశాడు.
పవర్ ప్లే ముగిసే సమయానికి 45 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, 185+ స్ట్రైయిక్ రేటుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఐపీఎల్ కెరీర్‌లో 194 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 27.94 సగటుతో 4800 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో 8వ స్థానంలో ఉన్నాడు ఊతప్ప...
22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన అంబటి రాయుడు, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
శివమ్ దూబే 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముగింట ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో లూయిస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 9 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెప్టెన్ రవీంద్ర జడేజా, ఆండ్రూ టై వేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
క్రీజులోకి వస్తూనే ఓ సిక్సర్, ఓ ఫోర్ కొట్టిన ఎమ్మెస్ ధోనీ 6 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా డివాన్ కాన్వే స్థానంలో జట్టులోకి వచ్చిన డ్వేన్ ప్రెటోరియస్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవిభిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పిస్తున్న సమయంలో రవి భిష్ణోయ్ తన 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు వంటి కీలక వికెట్లు తీయడం విశేషం.
