పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్... ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదో ఓటమి... మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ కాళ్లకు మొక్కిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఏదీ కలిసి రావడం లేదు. మొదటి ఐదు మ్యాచుల్లో పరాజయాలను చవిచూసిన ముంబై ఇండియన్స్, మరో మ్యాచ్ ఓడితే అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. బౌలర్లను మార్చినా, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినా... ముంబై ఇండియన్స్‌కి విజయం మాత్రం దక్కడం లేదు...
ముంబై ఇండియన్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్‌తో పాటు ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్లేయర్‌గా టీమ్‌తో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో సచిన్ టెండూల్కర్ పాదాలకు నమస్కారం పెట్టాడు జాంటీ రోడ్స్...
పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్, తన పాత టీమ్ మేట్ అనిల్ కుంబ్లేతో కాసేపు ముచ్చటించాడు సచిన్ టెండూల్కర్. ఆ వెనకే ఉన్న జాంటీ రోడ్స్, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాదాలకు నమస్కారం పెట్టబోయాడు. వెంనటే అతన్ని వారించిన సచిన్ టెండూల్కర్, ఆత్మీయంగా హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
ఈ మొత్తం ఎపిసోడ్‌ని చూస్తూ ఉండిపోయిన స్టేడియంలో ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. జాంటీ రోడ్స్ వయసు 52 ఏళ్లు కాగా సచిన్ టెండూల్కర్ వయసు 48 ఏళ్లు. తన కంటే నాలుగేళ్లు చిన్నోడైనా క్రికెట్ ప్రపంచంలో దేవుడిని కీర్తించబడిన సచిన్ టెండూల్కర్‌ని గౌరవార్థంగా కాళ్లను నమస్కరించి ఉంటాడని అంటున్నారు మాస్టర్ ఫ్యాన్స్...
పంజాబ్ కింగ్స్‌కి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్, ఇంతకుముందు ముంబై ఇండియన్స్‌కి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన జాంటీ రోడ్స్, 2017లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కి మారాడు.
తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యఛేదనలో 186 పరుగులకి పరిమితమైన ముంబై ఇండియన్స్, 12 పరుగుల తేడాతో ఓడింది.
ఇషాన్ కిషన్ 3 పరుగులే చేసి నిరాశపరిచినా రోహిత్ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు, డేవాల్డ్ బ్రేవిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు, తిలక్ వర్మ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేయడంతో ఒకానొక దశలో 16 ఓవర్లు ముగిసే సమయానికి 152/4 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, ఈజీగా విజయాన్ని అందుకునేలా కనిపించింది...
అయితే ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ విజయానికి చేరవగా వచ్చి, వరుసగా ఐదో పరాజయాన్ని చవిచూసింది.
ముంబై విజయానికి ఆఖరి 10 బంతుల్లో 22 పరుగులు కావాల్సి రాగా 9 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ కింగ్స్‌ని గెలిపించారు బౌలర్లు. ఆఖరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయానికి 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా మొదటి బంతికే సిక్సర్ బాదాడు ఉనద్కడ్ జయ్‌దేవ్. ఆ తర్వాత నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసిన ఓడియన్ స్మిత్... ముంబైని చిత్తు చేశాడు.
