Asianet News TeluguAsianet News Telugu

పరాగ్ వర్సెస్ పటేల్.. చేతులు కలపనంత శత్రుత్వమా..? ఇది పద్దతి కాదు హర్షల్

TATA IPL 2022: క్రికెట్ లో భావోద్వేగాలు సహజం. ముఖ్యంగా టీ20 లో అయితే అవి పీక్స్ లో ఉంటాయి. మ్యాచ్ లో ఎంత గొడవపడ్డా ముగిశాక గొప్ప గొప్ప ఆటగాళ్లు సైతం చేతిలో చేయి వేసుకోవడం  ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. కానీ ఈ ఆర్సీబీ ఆటగాడు మాత్రం...

IPL 2022: Harshal Patel Refuses to shake Hands With Riyan Parag After Both Exchanged Words during  RCB vs RR
Author
India, First Published Apr 27, 2022, 3:48 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్తాన్ రాయల్స్ మధ్య మంగళవారం పూణే వేదికగా ముగిసిన ఐపీఎల్-2022 సీజన్ 39వ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాడు  హర్షల్ పటేల్ వ్యవహార శైలి  విమర్శలకు తావుతీసింది.  రాజస్తాన్ ను ఆదుకున్న రియాన్ పరాగ్.. హర్షల్ మధ్య తలెత్తిన గొడవ ఈ వివాదానికి దారి తీసింది.   రాజస్తాన్  ఇన్నింగ్స్ ముగిశాక  ఈ ఇద్దరూ వాదులాడుకున్నారు.  దాదాపు కొట్టుకునేంత పని చేశారు. కానీ  మ్యాచ్ అనంతరం పరాగ్ వచ్చి హర్షల్ పటేల్ కు షేక్ హ్యాండ్ ఇస్తే అతడు మాత్రం అందుకు నిరాకరించాడు. అసలేం జరిగింది..? పటేల్ ఎందుకిలా చేశాడు..? 

వివరాల్లోకెళ్తే.. మంగళవారం నాటి మ్యాచ్ లో రాజస్తాన్ ప్రధాన బ్యాటర్లంతా విఫలమైన చోట  పరాగ్  అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆ జట్టును ఆదుకున్నాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లతో సహా 18 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ ముగిశాక ఇరు ఆటగాళ్లు పెవిలియన్ కు వెళ్తుండగా  ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. 

 

హర్షల్ ను ఉద్దేశించి ఏదో అనుకుంటూ వెళ్తున్న  పరాగ్ ను అతడు ఆపాడు. ‘ఏంటి ఏదో మాట్లాడుతున్నావ్..’ అని ఇద్దరూ వాదులాడుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు కొట్టుకోవడానికి వచ్చారు.  దీంతో వెంటనే రాజస్తాన్ రాయల్స్  సహాయక సిబ్బందిలో ఒకరు జోక్యం చేసుకుని అటు పరాగ్ ను ఇటు హర్షల్ ను  వేరు చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నారంతా. కానీ అక్కడే అసలు బీజం పడింది. 

రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ఆర్సీబీ ఛేదించలేకపోయింది. ఆఖరి ఓవర్లో  హర్షల్ పటేల్.. కుల్దీప్ సేన్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఆర్సీబీ ఇన్నింగ్స్ కు తెరపడింది.  మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. రియాన్ పరాగ్ కూడా అదే పని చేశాడు. పటేల్ తో గొడవపెట్టుకున్నా తాను మాత్రం ముందే షేక్  హ్యాండ్ ఇచ్చాడు. కానీ పటేల్ మాత్రం చేతిని వెనక్కి తీసుకుని పరాగ్ కు కాకుండా అతడి వెనకాల ఉన్న బట్లర్  చేతిలో చేయి కలిపాడు. కనీసం అతడి ముఖం కూడా చూడలేదు.

 

ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.  ఏదో మాటలనుకున్నందుకు  ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని కామెంట్స్ చేస్తున్నారు. హర్షల్ వ్యవహారశైలిపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios