TATA IPL 2022 GT vs SRH: భారీ స్కోరు ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడిన  గుజారత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు ఉమ్రాన్ మాలిక్. అయితే ఆఖరి ఓవర్లో  రషీద్ ఖాన్ విధ్వంసం గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని అందించింది. 

చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన గుజరాత్ టైటాన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో విజయం గుజరాత్ నే వరించింది. బ్యాటర్లు భారీ స్కోరు చేసినా పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు దానిని నిలువరించలేకపోయారు. ఉమ్రాన్ మాలిక్ ఐదు వికెట్ల ప్రదర్శనను బూడిదలో పోసిన పన్నీరులా చేస్తూ.. మార్కో జాన్సేన్ హైదరాబాద్ కు సీజన్ లో ఐదు విజయాల తర్వాత పరాజయాన్ని అందించాడు. ఆఖర్లో రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా ల వీర విధ్వంసం కారణంగా గుజరాత్ ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఎదురైన పరాజయానికి గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంది. 

భారీ లక్ష్య ఛేదన ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ ముందు నుంచీ దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (38 బంతుల్లో 68.. 11 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడాడు. గత మ్యాచ్ లో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన జాన్సేన్ ఈ మ్యాచ్ లో రాణించలేదు. అతడు వేసిన రెండో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు సాహా. శుభమన్ గిల్ (22) కూడా ఫోర్ బాదాడు. మొత్తంగా ఆఓవర్లో 18 పరుగులొచ్చాయి. 

గిల్ నెమ్మదిగా ఆడగా సాహా దూకుడును కొనసాగించాడు. భువీ వేసన 3వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. నటరాజన్ వేసిన ఆరో ఓవర్లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. దీంతో తొలి 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. 

ఉమ్రాన్.. తుఫాన్ 

ఓపెనర్లిద్దరూ ధాటిగా ఆడుతుండటంతో సన్ రైజర్స్ సారథి ఉమ్రాన్ మాలిక్ కు బంతినిచ్చాడు. 8వ ఓవర్ వేసిన ఉమ్రాన్.. మూడో బంతికి శుభమన్ గిల్ ను బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన హార్ధిక్ పాండ్యా (10) ను తన తర్వాతి ఓవర్లో ఔట్ చేసి హైదరాబాద్ కు మరో బ్రేక్ ఇచ్చాడు. 

వరుసగా రెండు వికెట్లు పడ్డా సాహా అదే దూకుడు కొనసాగించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 11 వ ఓవర్లో లాంగాన్ దిశగా సింగిల్ తీసి ఐపీఎల్ లో తన 9వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత మార్కో జాన్సేన్ బౌలింగ్ లో రెండు బౌండరీలు కొట్టాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న సాహాను ఔట్ చేయడానికి గాను మళ్లీ ఉమ్రాన్ కే బంతినిచ్చాడు విలియమ్సన్. 

14వ ఓవర్ వేసిన ఉమ్రాన్.. రెండో బంతికి అద్భుతమైన యార్కర్ తో సాహాను బౌల్డ్ చేశాడు. ఆ బంతి 153 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడం గమనార్హం. ఇక తన చివరి (ఇన్నింగ్స్ 16వ) ఓవర్లో డేవిడ్ మిల్లర్ (17) కూడా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే అభినవ్ మనోహర్ (0) ను కూడా బౌల్డ్ చేసి.. మొత్తంగా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో అతడికి ఇది తొలి 5 వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. అతడు తీసిన ఐదు వికెట్లలో పాండ్యా తప్ప మిగిలిన నలుగురు బౌల్డ్ కావడం విశేషం. 

కాగా ఐపీఎల్ లో ఇది అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు యుజ్వేంద్ర చాహల్ కేకేఆర్ మీద 5 వికెట్ల ప్రదర్శన చేసినా అతడు 40 పరుగులిచ్చాడు. కానీ ఉమ్రాన్ మాత్రం 5 వికెట్లు తీసి 25 పరుగులే ఇచ్చాడు. అదీగాక తాజా ప్రదర్శనతో ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉమ్రాన్.. రెండో స్థానం (15)లో ఉన్నాడు. తొలి స్థానంలో చాహల్ (18) నిలిచాడు. 

జాన్సేన్ పోగొట్టాడు..

ఇక ఆఖర్లో తెవాటియా (21 బంతుల్లో 40 నాటౌట్.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (11 బంతుల్లో 31 నాటౌట్.. 4 సిక్సర్లు) గుజరాత్ గెలుపునకు గొప్ప పోరాటం చేశారు. ఆఖరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా జాన్సేన్ వేసిన ఓవర్లో తొలి బంతికి తెవాటియా సిక్సర్ కొట్టి రషీద్ ఖాన్ కు స్ట్రైక్ ఇచ్చాడు. తర్వాత మూడు బంతులను రషీద్ ఖాన్ సిక్సర్లు బాదాడు. ఫలితంగా గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (65), మార్క్రమ్ (56) లు రాణించారు. ఆఖర్లో శశాంక్ సింగ్.. 6 బంతుల్లోనే 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

సంక్షిప్త స్కోరు : 
- సన్ రైజర్స్ హైదరాబాద్ : 195/6
- గుజరాత్ టైటాన్స్ : 20 ఓవర్లలో 199/5 
ఫలితం : 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు