IPL 2022 Final: 15వ సీజన్ ముగింపు వేడుకల్లో బీసీసీఐ ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డు... అతి పెద్ద క్రికెట్ జెర్సీని సృష్టించిన భారత క్రికెట్ బోర్డు...
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి హోస్ట్‌గా రీఎంట్రీ ఇస్తూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగింపు వేడులను ప్రారంభించారు. ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు ముగిసిన సందర్భంగా 10 జట్ల లోగోలతో ఓ ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది బీసీసీఐ...
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీని తయారుచేసిన భారత క్రికెట్ బోర్డుని గిన్నిస్ బుక్ రికార్డు వరించింది. ముగింపు వేడుకలు ప్రారంభమైన వెంటనే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాలకు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ని అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ని లైవ్‌లో వీక్షించేందుకు లక్షా 25 వేల మంది హాజరుకాగా... బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్, ఐపీఎల్ జెండాని చేబూని స్టేడియంలో పరుగెత్తుతూ తన పర్ఫామెన్స్‌ని మొదలెట్టాడు...
ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ తెలుగు పాటకి చిందులు వేసిన రణ్‌వీర్ సింగ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ మూవీలోని ‘వాతీ కమ్మింగ్’ సిగ్నేచర్ స్టెప్పులు వేశాడు. అలాగే లెటెస్ట్ సెన్సేషన్ ‘కేజీఎఫ్ 2’ మూవీలోని ‘సలాం రాకీ భాయ్’... పాటకు చిందులు వేశాడు...
రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ముగిసిన తర్వాత ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన బృందంతో కలిసి లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌ని తీసుకున్న ఏఆర్ రెహ్మాన్... ‘వందేమాతరం’ పాటతో స్టేడియంలో త్రివర్ణంతో నింపేశాడు..
భారత క్రికెట్ జట్టు కెరీర్ ఆరంభం నుంచి సాధించిన అద్భుత విజయాలను స్క్రీన్‌పై చూపిస్తూ, ఏ ఆర్ రెహ్మాన్ సంగీత కార్యక్రమం మొదలుకావడం విశేషం. దశాబ్దాల వారీగా విడదీసి.. 1983 వరల్డ్ కప్ నుంచి టీ20 వరల్డ్ కప్ 2007, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్ గెలవడం వంటి భారత జట్టు కెరీర్‌లో మైలు ఘట్టాలన్నింటినీ లక్షకు పైగా ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో రీ ప్రెసెంట్ చేసింది బీసీసీఐ...
ఏ ఆర్ రెహ్మాన్ వందేమాతర గీతాన్ని ఆలపిస్తుంటే, అతనితో కలిసి లక్షా 25 వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా స్వరం అందించడంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఓ వైపు రెహ్మాన్ పాటలు పాడుతుంటే మరో వైపు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలను వారి సంప్రదయా దుస్తుల్లో నర్తించి ఆయా రాష్ట్రాలను ప్రాతినిథ్యం వహించారు వందల మంది డ్యాన్సర్లు.
