IPL 2022 Eliminator Match: ఐపీఎల్-15 లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో క్రికెట్ మాఫియా గుట్టు రట్టయింది. లక్నో-బెంగళూరు మధ్య ముగిసిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్కతా పోలీసులు ఆన్లైన్ క్రికెట్ మాఫియా పని పట్టారు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముగిసిన హైఓల్టేజీ మ్యాచ్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. లైవ్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ముఠా.. స్టేడియంలోనే బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఒకపక్క మ్యాచ్ జరుగుతుండగానే మరోపక్క ఫోన్లతో ఎవరికీ అనుమానం రాకుండా ఫోన్లలో మునిగిపోయిన ఐదుగురు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులను బీహార్ కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికేత్ కుమార్ లుగా గుర్తించారు.
వివరాల్లోకెళ్తే.. లక్నో-బెంగళూరు మ్యాచ్ చూడటానికి ఎఫ్-1 బ్లాక్ కు సామాన్య ప్రేక్షకుల మాదిరిగానే వచ్చి కూర్చున్నారు పైన పేర్కొన్న నిందితులు. ప్రేక్షకులంతా మ్యాచ్ చూస్తుంటే ఈ ఐదుగురిలో ముగ్గురు మాత్రం మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్ లో మునిగిపోయారు.
వికెట్ పడ్డా.. సిక్సర్, ఫోర్ కొట్టినా స్టేడియంలో ప్రేక్షకులు హంగామా చేస్తారు. కానీ ఈ ఐదుగురు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా ఫోన్లలోనే మునిగారు. ఇది చూసిన చుట్టుపక్కల ప్రేక్షకులకు అనుమానం వచ్చింది. వాళ్లు వెంటనే స్టేడియం సిబ్బందికి సమాచారం అందించగా వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న యాంటీ రౌడీ స్క్వాడ్ (ఏఆర్ఎస్) పోలీసులు మఫ్టీలో వచ్చి నిందితుల వద్ద మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లకు చేయాల్సిన మర్యాదలు చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. నిందితులు తమ తప్పు ఒప్పుకోవడంతో పాటు కోల్కతాలోని న్యూమార్కెట్ ఏరియాలోని ప్రైవేట్ గెస్ట్ హౌజ్ లో మరో ఇద్దరు నిందితుల గురించి కూడా సమాచారమందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి ఈ రాకెట్ వెనుక ఎవరు ఉన్నారనేదానిపై దర్యాప్తు చేపట్టారు.
