టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్... ఛేతన్ సకారియాకి అవకాశం, కేకేఆర్ తరుపున బాబా అపరాజిత్ ఎంట్రీ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది... కేకేఆర్ తరుపున వికెట్ కీపర్ బాబా అపరాజిత్, పేసర్ హర్షిత్ రాణాలకు తొలి అవకాశం దక్కగా, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఛేతన్ సకారియాకి తొలిసారి తుదిజట్టులో అవకాశం దక్కింది.
గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన ఛేతన్ సకారియాను మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే ఇన్ని రోజులు సకారియాకి తుదిజట్టులో చోటు దక్కలేదు. అలాగే కరోనా కారణంగా గత రెండు మ్యాచులకు దూరమైన మిచెల్ మార్ష్, నేటి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీషా హాఫ్ సెంచరీలతో మెరిసి ఢిల్లీ క్యాపిటల్స్‌కి 215 పరుగుల భారీ స్కోరు అందించారు.. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో, నితీశ్ రాణా 30 పరుగులు చేసి ఆకట్టుకున్నా కేకేఆర్ 171 పరుగులకే పరిమితమైంది.
ఐపీఎల్ 2022 సీజన్‌ను టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. గత సీజన్‌లో ఫైనల్ చేరినా, టైటిల్ సాధించలేకపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి అదరగొడుతుందని భావించారంతా. ఆరంభంలో మంచి విజయాలతో ఆకట్టుకుంది కేకేఆర్...
మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి... పాయింట్ల పట్టికలో కిందికి దిగజారింది... ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం 5 విజయాలు అందుకోవాల్సిందే...
మరోవైపు టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా సీజన్‌ని ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఫస్టాఫ్‌లో 7 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకోగలిగింది ఢిల్లీ... తనను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్...
గత మ్యాచ్‌లో ఒక్క నో బాల్ కోసం నానా రాద్ధాంతం చేసి విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్, ఆ విషయాన్ని మరిపించే విజయం కోసం చూస్తున్నాడు. ఇరుజట్లకీ నేటి మ్యాచ్ ఫలితం కీలకం కానుంది.
కోల్‌కత్తా నైట్‌రైడర్స్: ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్, బాబా అపరాజిత్, రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ సాంట్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, రోవ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా
