Subhranshu Senapati: ఒడిశాకు చెందిన యువ క్రికెటర్ సుభ్రాంశు సేనాపతికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఐపీఎల్ నిలకడకు మారుపేరైన జట్టుగా గుర్తింపు పొందిన ఈ ఏడాది విజేత నుంచి అతడికి పిలుపొచ్చింది.
యువ ఆటగాళ్ల కోసం దేశవాళీ క్రికెట్ ను జల్లెడ పడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ మేరకు కొంతమేరకు విజయవంతమైనట్టే కనిపిస్తున్నాయి. భారీ హిట్టర్లు, మ్యాచ్ విన్నర్ల కోసం చూసే క్రమంలో ఐపీఎల్-2021 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ చూపు ఒడిశాకు చెందిన ఓ యువ క్రికెటర్ మీద పడింది. అతడి పేరే సుభ్రాంశు సేనాపతి. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశా తరఫున అత్యధిక పరుగుల వీరుడు అతడే. ఇతడికి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి పిలుపువచ్చింది.
వచ్చే సీజన్ కు ముందు సెలెక్షన్స్ ట్రయల్స్ కోసం అందుబాటులో ఉండాలని సుభ్రాంశుకు సీఎస్కే నుంచి పిలుపువచ్చింది. ఈ విషయాన్ని ఏకంగా ఒడిశా క్రికెట్ అసోసియేషన్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించింది.
ఒడిశాకు చెందిన 24 ఏండ్ల సుభ్రాంశు.. రైట్ హ్యాండ్ బ్యాటర్. విజయ్ హాజారే ట్రోఫీలో ఒడిశా తరఫున 7 మ్యాచులు ఆడి 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఒడిశా తరఫున అత్యధిక పరుగులు సాధించింది సేనాపతినే. ఈనెల 8న ఆంధ్రాతో జరిగిన మ్యాచులో సేనాపతి సెంచరీ చేశాడు. ఈ మ్యాచులో అతడి సెంచరీ సాయంతో ఒడిశా.. 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేగాక విదర్భ, హిమాచల్ ప్రదేశ్ ల మీద అతడు అర్థ శతకాలు నమోదు చేశాడు.
విజయ్ హజారేతో పాటు ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కూడా ఈ యువ క్రికెటర్ మెరిశాడు. ఆ టోర్నీలో అతడు ఆడిన 5 మ్యాచులలో 138 పరుగులు చేశాడు. మొత్తంగా టీ20 కెరీర్ లో (2017 నుంచి) ఇప్పటివరకు 26 మ్యాచులాడిన అతడు.. 637 పరుగులు సాధించాడు.
ఇక చెన్నై విషయానికొస్తే ఇప్పటికే ఆ జట్టు రిటెన్షన్ ద్వారా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రూ. 16 కోట్లతో రవీంద్ర జడేజా ను, రూ. 12 కోట్లతో మహేంద్ర సింగ్ ధోనిని, రూ. 8 కోట్లతో మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ లను నిలుపుకుంది. త్వరలో ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో సుభ్రాంశు సేనాపతి కి పిలుపురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
