TATA IPL 2022: ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనలతో  పాయింట్ల పట్టికలో  అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆటతీరుతో పాటు ఆ జట్టు వేలంలో తీసుకున్న వ్యూహాల పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఐపీఎల్-15లో వరుసగా ఏడు విజయాలతో సీజన్ లో అత్యంత చెత్త ఆటతీరు ప్రదర్శిస్తున్న ముంబై ఇండియన్స్ పై ఆ జట్టు అభిమానులే గాక క్రీడా విశ్లేషకులు కూడా ఫైర్ అవుతున్నారు. వేలంలో అంతగా ప్రాధాన్యం లేని ఆటగాళ్ల మీద కోట్లు ఖర్చు చేసి తగిన మూల్యం చెల్లించుకుంటుందని దుమ్మెత్తి పోస్తున్నారు. రెండు సీజన్లలో మెరిసిన ఇషాన్ కిషన్ మీద రూ. 15.25 కోట్లు ఖర్చు చేయడం.. అసలు ఈ సీజన్ కు తాను అందుబాటులో ఉండనని చెప్పిన జోఫ్రా ఆర్చర్ కు రూ. 8 కోట్లు వెచ్చించడం తెలివి తక్కువ వ్యవహారమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇద్దరిపై ముంబై ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. 

అయితే ఈ విమర్శలపై ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమను విమర్శిస్తున్న వారు ఒకవేళ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో బాగా ఆడిఉంటే ఇలా అనేవారా..? అని ప్రశ్నించాడు. ఇషాన్ కిషన్, ఆర్చర్ లను తీసుకోవడం సరైందే అని చెప్పుకొచ్చాడు. 

జహీర్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ మేం ఈ సీజన్ లో విజయాలు సాధించి ఉంటే దాని (వేలంలో అనుసరించిన వ్యూహం) గురించి ఎవరైనా మాట్లాడేవారా..? మేము మా పరాజయాలకు ఏ ఒక్కరినీ నిందించదలుచుకోవడం లేదు. వ్యక్తిగతంగా ఒక ఆటగాడిపై నింద వేయడం మేం చేయడం లేదు. సీజన్ ముగిసేంతవరకు మేము జట్టులో అందరికీ మద్దతుగా నిలుస్తాం..’ అని చెప్పుకొచ్చాడు. ముంబై సారథి రోహిత్ శర్మ ఫామ్ మీద కూడా తమకు సమస్య లేదని, అతడు ఎంతటి నాణ్యమైన ఆటగాడో తమకు తెలుసునని జహీర్ తెలిపాడు.

Scroll to load tweet…

కాగా.. ఇషాన్ కిషన్ ను వేలంలో అంత ధర పెట్టి వెచ్చించడం పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ప్రస్తుత ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వేలంలో అతడికి ముంబై అంత ధర ఎందుకు పెట్టిందో తనకైతే అర్థం కాలేదని, ఇషాన్ లో అంత స్థాయిలో ఆడేంత సామర్థ్యం లేదని బాహాటంగానే కామెంట్స్ చేశాడు. గత 7 ఇన్నింగ్స్ లలో ఇషాన్ స్కోర్లు వరుసగా.. 82, 54, 14, 26, 3, 13, 0 గా ఉన్నాయి. 

ఇక ఈ సీజన్ లో తాను అందుబాటులో ఉండను బాబోయ్ అని జోఫ్రా ఆర్చర్ వేలంలో తన పేరును నమోదు చేసుకోకపోయినా ముంబై కావాలనే అతడి పేరును పట్టుబట్టి మరీ చేర్పించి ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. దీనిపై ఆ జట్టు సారథి రోహిత్ శర్మ కూడా ముంబై యాజమన్యంపై అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ ధరలో స్థానికంగా ముగ్గురు నలుగురు నాణ్యమైన పేసర్లు దొరికేవారని వాళ్ల దగ్గర వాపోయినట్టు సమాచారం. 

కాగా వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లలో ఓడిన రోహిత్ సేన.. తమ తదుపరి మ్యాచ్ లక్నో తో ఆదివారం (ఏప్రిల్ 24న) ఆడనుంది. ఇప్పిటికే ఐపీఎల్-15 ప్లేఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన ముంబై.. తొలి విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.