Sun Risers Hyderabad: ఐపీఎల్-15లో తొలుత ఆడిన వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి.  ఇక వీళ్లు మారరు.. మన మ్యాచులు చూడకుండా ఉంటే బెటర్ అనుకుంటున్న తరుణంలో  సన్ రైజర్స్ హైదరాబాద్..  దుమ్ము దులుపుతున్నది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్  లో అద్భుతంగా రాణిస్తూ టైటిల్ వేటలో ముందుకు సాగుతున్నది.

ఐపీఎల్ లో ఆ జట్టుకు ఓ ట్రోఫీ అందిండమే గాక నాలుగు సార్లు ప్లేఆఫ్ కు చేర్చిన సారథి (డేవిడ్ వార్నర్) పలు కారణాల రీత్యా ఈ సీజన్ లో దూరమయ్యాడు. గత సీజన్ లో అతడిని ఎందుకు ఆడించలేదో తెలియదు. ఎందుకు పక్కనపెట్టారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఫలితం 2021 ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. 14 మ్యాచులాడితే గెలిచినవి మూడే.. ఈ హడావిడిలోనే 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. వేలం కూడా అయిపోయింది. జట్టు తీసుకున్న ఆటగాళ్లు ఏమంత స్టార్లు కాదు. గ్లామర్ ఎటూ లేదు. అనుకున్నట్టుగానే తొలి రెండు మ్యాచుల్లో పరాజయాలు.. ‘హా.. ఈ సీజన్ కూడా గోవిందా..’ అనే స్థితికి వచ్చారు సొంత జట్టు అభిమానులు. ఇక వీళ్లు మారరు.. అని ఇతర జట్ల అభిమానులు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయా జట్ల అడ్మిన్లు మీమ్స్... ఎక్కడ చూసినా నైరాశ్యం. కానీ... 

సన్ రైజర్స్ హైదరాబాద్ బెదరలేదు. విమర్శలను పట్టించుకోలేదు. తమపై చేసిన ప్రతీ విమర్శనూ గుండెల్లో దాచుకుంది. ప్రతివిమర్శలకు దిగలేదు. మ్యాచుల్లోనే మాట్లాడాలనుకుంది. ఎంతలా అంటే.. వాగిన ప్రతీ నోరూ మూతపడేలా.. వేలెత్తి చూపినా ప్రతీ చేయి దించుకునేలా... తన పని తాను కానివ్వడం అంటే ఇదేనేమో.. 

అవును.. సన్ రైజర్స్ అద్భుతాలు చేస్తున్నది. గత సీజన్ లో ఎదురైన పరాభావాలను పంటికింద భరిస్తూ.. అభిమానులకు మరోసారి ట్రోఫీ ఆశలు కల్పిస్తూ నిశ్శబ్ద విప్లవం తీసుకొస్తున్నది. తొలి రెండు మ్యాచులు (రాజస్తాన్, లక్నో తో) ఓడినా వరుసగా నాలుగు మ్యాచు (చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్, కోల్కతా, పంజాబ్) లను గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్ లో వరుసగా నాలుగు మ్యాచులు గెలిచిన జట్టు హైదరాబాదే కావడం విశేషం.

బ్యాటింగ్ లో దిగులు లేదు.. 

గతంలో సన్ రైజర్స్ బ్యాటింగ్ కు మూల స్తంభం డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్. ఈ ఇద్దరూ నిష్క్రమిస్తే అంతే. కానీ ఇప్పుడలా కాదు. ఓపెనర్ గా కేన్ మామ ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక్క గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగిలిన మ్యాచుల్లో గొప్పగా రాణించలేదు. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తున్నాడు.

Scroll to load tweet…

ఇక మునుపెన్నడూ లేనంతగా మన మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. వన్ డౌన్ లో వచ్చే రాహుల్ త్రిపాఠి మెరుపులు మెరిపిస్తున్నాడు. కోల్కతా తో మ్యాచ్ లో 71 పరుగులు చేసిన అతడు.. తాజాగా పంజాబ్ తో కూడా 34 రన్స్ చేశాడు. అతడి తర్వాత వచ్చే ఎయిడెన్ మార్క్రమ్.. నిలకడగా ఆడుతున్నాడు. నికోలస్ పూరన్ ఆఖర్లో ఫినిషింగ్ టచ్ లు ఇస్తూ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తున్నాడు. దీంతో కేన్ మామ నిష్క్రమించినా హైదరాబాద్ అభిమానులు పెద్దగా ఆందోళన చెందటం లేదు. 

బౌలింగ్ లో కేకో కేక.. 

హైదరాబాద్ ప్రధాన ఆయుదం బౌలింగే. భువనేశ్వర్ కుమార్, యార్కర్ కింగ్ నట్టూ (నటరాజన్), దక్షిణాఫ్రికా యువ కెరటం మార్కో జాన్సేన్ లతో పాటు యువ సంచలనం జమ్మూ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ రెచ్చిపోతున్నారు. ఆరు మ్యాచులాడిన నట్టూ.. 12 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న యుజ్వేంద్ర చాహల్ (రాజస్తాన్) తో సమానంగా నిలిచాడు. 

Scroll to load tweet…

ఇక ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతులకు ప్రత్యర్థుల దగ్గర సమాధానదం లేదు. పంజాబ్ తో మ్యాచ్ లో ఉమ్రాన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక డెత్ ఓవర్లలో భువీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. 

వరుస విజయాలతో ట్రాక్ లో పడ్డ సన్ రైజర్స్.. ఇదే స్పీడ్ తో ప్లే ఆఫ్స్ కు చేరి మరోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్ అభిమానులు.. ‘ఇన్నాళ్లొక లెక్క ఇప్పుడొక లెక్క.. అపోజిషన్ టీమ్ లకు ఇది కొత్త హైదరాబాద్ అని చెప్పు...’ అని కామెంట్లు పెడుతున్నారు.