IPL 2021 RCB vs SRH: ఐపీఎల్ లో వరుస పరాజయాలతో కుంగిపోయిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు ఊరట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు తడబడింది. ఆఖరి బంతివరకు ఉత్కంఠగా సాగిన  మ్యాచ్ లో హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది.

అబుదాబి వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన పోరులో Kane williamson సేన విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (41), Glenn Maxwell (25బంతుల్లో 40) మరోసారి రాణించారు. ఆఖరు బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో విజయం మాత్రం హైదరాబాద్ ను వరించింది. 

స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన RCBకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ Virat Kohli (5) ని భువనేశ్వర్ తొలి ఓవర్లోనే ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన డేనియల్ క్రిస్టియన్ (1), శ్రీకర్ భరత్ (12) లు త్వరగానే ఔటయ్యారు. ఈ సమయంలో బ్యాటింగ్ కు దిగిన మ్యాక్స్వెల్.. స్కోరు బోర్డును పరుగెత్తించాడు. రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్లో సిక్స్, ఫోర్ తో కలిపి 15 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 14 వ ఓవర్ లో మ్యాక్సీ రనౌట్ అయ్యాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 98/4గా ఉంది. 

మ్యాక్స్వెల్ అవుటైన కొద్దిసేపటికే 16.5 ఓవర్లో ఓపెనర్ పడిక్కల్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లో అబ్దుల్ సమద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెనువెంటనే అహ్మద్ (14) తో కలిసి డివిలియర్స్ (19 నాటౌట్) విజయం కోసం పోరాడినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి kohli సేనను నిలువరించారు. దీంతో విజయానికి వాళ్లకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ దశలో భువనేశ్వర్.. తొలి మూడు బంతుల్లో మూడు పరుగులు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. నాలుగో బంతికి డివిలియర్స్ సిక్సర్ కొట్టగా.. ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. ఆరో బంతికి ఒక్క పరుగు వచ్చింది. దీంతో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా వరుసగా మూడు విజయాల తర్వాత రాయల్స్ కు ఇది తొలి పరాజయం. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Scroll to load tweet…

కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 151 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రన్ మాలిక్.. ఈ మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. తొమ్మిదో ఓవర్లో రెండో బంతి గంటకు 151 కిలో మీటర్లు, తర్వాతి బంతి 152, నాలుగో బంతిని ఏకంగా 153 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఈ మ్యాచ్ లో ఉమ్రన్ తో పాటు జేసన్ హోల్డర్, సిద్ధార్థ కౌల్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.