క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రెటీ హోదా ఉంటుంది. మన దేశంతోపాటు.. ఇతర దేశాల్లోనూ వారికి అభిమానులు ఉంటారు. చాలా మంది అభిమానులు.. తమ అభిమాన క్రికెటర్ దగ్గర ఆటోగ్రాఫ్, ఫోటో గ్రాఫ్ తీసుకోవాలని ఆశపడుతుంటారు. అలాంటి అవకాశం రాగానే సద్వినియోగం చేసుకున్నారు. తాజాగా ఓ అభిమాని అదే చేశాడు. అయితే.. ఆ అభిమాని.. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న ప్లేయర్ కావడం గమనార్హం. అతను రోహిత్ శర్మకు విపరీతమైన ఫ్యాన్ కావడంతో.. ఆటో గ్రాఫ్ తీసుకోగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆవేశ్‌ ఖాన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్‌లాడిన అతను ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్‌ జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ 2 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

ఈ విషయం పక్కనపెడితే.. ఆవేశ్‌ ఖాన్‌కు రోహిత్‌ శర్మ అంటే విపరీతమైన అభిమానం. తనతో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్‌ చేయడం ఆనందం కలిగించిందని  మ్యాచ్‌ తర్వాత చెప్పుకొచ్చాడు. అందుకే మ్యాచ్‌ ముగిశాక రోహిత్‌ను కలిసిన ఆవేశ్‌ ఖాన్‌ తన జెర్సీని తీసి రోహిత్‌కు ఇచ్చి ఆటోగ్రాఫ్‌ కావాలని అడిగాడు. అత‌ని అభిమానానికి ఫిదా అయిన రోహిత్ ముసిముసిగా న‌వ్వుతూ జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.  దీనికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.