IPL 2021: ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన Virat Kohli నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు..  నేడు Sun Risers Hyderabadతో జరిగే మ్యాచ్ లో నెగ్గి తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తున్నది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో Royal Challengers Banglore జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఫలితం నామమాత్రమే అయినప్పటికీ జోరు మీదున్న బెంగళూరు.. దానిని కొనసాగించాలని చూస్తున్నది. IPL PlayOffs రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ కు, బెర్త్ దక్కించుకున్న బెంగళూరుకూ ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా కొత్తగా ఒరిగేది లేదు. అయితే ఇవాళ్టి మ్యాచ్ తో పాటు తర్వాతి మ్యాచ్ కూడా rcb నెగ్గి.. ఆఖరు మ్యాచ్ లో చెన్నై ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానానికి వెళ్లే అవకాశముంది. 

మరోవైపు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యంత చెత్తగా ఆడి అన్ని జట్ల కంటే ముందే ప్లే ఆఫ్ బరి నుంచి తప్పుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇకనైనా గెలుపు బాట పట్టాలని చూస్తున్నది. ఆఖరు రెండు మ్యాచ్ లోనైనా గెలిచి విజయాలతో టోర్నీని ముగించాలని భావిస్తున్నది.

నేటి మ్యాచ్ కోసం రెండు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ లో ఆడిన జట్లనే కొనసాగిస్తున్నాయి. ఇక బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఆర్సీబీ.. Kane williamson సారథ్యంలోని హైదరాబాద్ జట్టు కంటే పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లో కోహ్లి, పడిక్కల్, మ్యాక్స్వెల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. డివిలియర్స్ ఇప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అదొక్కటే బెంగళూరుకు లోటు. బౌలింగ్ లో హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అంతేగాక ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధిస్తే అది ఐపీఎల్ లో జట్టు వందో విజయం కానుంది.

మరోవైపు సన్ రైజర్స్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ జట్టులో ఒక్కడంటే ఒక్క ఆటగాడు కూడా కనీస స్థాయి ఆటను కూడా ఆడటం లేదు. కేన్ విలియమ్సన్, సాహా, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ బ్యాటింగ్ లో విఫలమవుతుండగా.. బౌలర్లలో భువనేశ్వర్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కాగా గత మ్యాచ్ లో ఆకట్టుకున్న ఉమ్రన్ మాలిక్ నేటి మ్యాచ్ లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన RCB.. 8 విజయాలతో 16 పాయింట్లు నెగ్గి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు అంతే మ్యాచ్ లు ఆడిన SRH.. ఏకంగా పది మ్యాచులలో (4 పాయింట్లు) ఓడి పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. 

ఇక ఇరుజట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో 19 సార్లు ముఖాముఖి తలపడగా.. సన్ రైజర్స్ 10 సార్లు గెలవగా.. బెంగళూరు 8 మ్యాచులలో విజయం సాధించింది. యూఏఈలో ఈ రెండు జట్లు మూడు సార్లు పోటీ పడగా.. 2-1 తేడాతో మొగ్గు హైదరాబాద్ వైపే ఉన్నా ఈ సీజన్ లో ఆడిన గత మ్యాచ్ లో విజయం ఆర్సీబీని వరించింది. 

జట్లు: 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

సన్ రైజర్స్ హైదరాబాద్: జేసన్ రాయ్, సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, ఉమ్రన్ మాలిక్